calender_icon.png 18 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగు కూడా లేని.. ఫోర్త్ సిటీకి రోడ్లెందుకు?

18-09-2025 01:41:00 AM

సీఎం కుటుంబ సభ్యుల కోసమే అలైన్‌మెంట్‌లో మార్పు

  1. మెట్రో ప్రాజెక్టులో ఎల్ అండ్ టీకి వేధింపులు 
  2. కుడితిలో ఎలుకల మాదిరిగా ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి 
  3. సొంత ప్రయోజనాల కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు 
  4. యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో రేవంత్‌రెడ్డికి తెలియదు 
  5. బీసీ డిక్లరేషన్‌లోనే షరతులు పెట్టాల్సింది 
  6. తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : పురుగు కూడా లేని ఫోర్త్ సిటీకి రోడ్లు ఎందుకని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం సీఎం రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసం వేస్తున్నారని, ఈ రోడ్డు వెంబడి అనేక మందితో భూములు కొనుగోలు చేయించి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

ఎలాం టి భూసేకరణ అవసరం లేకుండా రూపొందిం చిన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేని రేవంత్ రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ర్టంలో గ్రూప్--1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. అన్నివర్గాల పైన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయని, ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేయడంతో హాస్పిటళ్లు స్తంభించాయని బుధవారం తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్‌లో కేటీఆర్ విమర్శించారు.

సీఎం బెదిరింపులు, ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ వైదొలుగుతోందని అన్నారు.  త్వరలో గతంలో వివాదాస్పదమైన ఎంఆర్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మబోతున్నారని, ఇందులో ఆయన ఎంత కమిషన్ తీసుకున్నారో తెలుస్తుందన్నారు. గతంలో పలు కంపెనీలపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని, అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. 

ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు..

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, తమ వాయిస్ వినిపించే హక్కు ఉందని కేటీఆర్ అన్నారు. కొత్త పార్టీ లు పెట్టుకుని తమ విధానాలను ప్రజలకు చెప్పి వారి దగ్గరకు వెళ్లవచ్చని స్వాగతించారు. తాము బతుకమ్మ చీరలు కులం, మతం, అంతం, వేదం లేకుండా అందరికీ ఇచ్చామని, అయితే ఈ ప్రభుత్వం కొందరికి మాత్రమే ఇస్తోందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ ధీటుగా స్పందించారు.

సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల కాంట్రాక్టులు కొత్తగా ఇచ్చారని, మరి బంధుప్రీతి లేని ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ముడుపులు వసూ లు చేసి ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పని అని ఆరోపించారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల పైన తీర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

దేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ దందా జరగడం దారుణమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘కుడితిలో ఎలుకల’ మాదిరిగా మారిందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాడిన ప్రతి ఒక్కరూ దారుణంగా మోసపోయారన్నారు. 

సొంత ప్రయోజనాల కోసమే..

రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామని, కానీ దాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో వేలాది మంది రైతులు తమ భూములు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని తెలిపారు.

ఫోర్త్ సిటీ దగ్గర ఉన్న తమ భూముల కోసం అలైన్‌మెంట్ మార్చి, రీజినల్ రింగ్ రోడ్ స్వరూపాన్ని మార్చేశారని, దీని వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా రూపొందించిన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేని రేవంత్ రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని భూములన్నింటినీ అమ్ముతున్నారని, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే రద్దుతో ఐటీ పరిశ్రమ విస్తరణకు విఘాతం కలిగిందని చెప్పారు. 

హైడ్రా ‘హైడ్రామా’..

‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’ అయిందని, ‘హైడ్రా’కు పెద్ద వాళ్ళు కనిపించరని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ని అన్నింటినీ అమ్మేస్తాడని, గతంలో పీసీసీ పీఠాన్ని కొని, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి మేకలు, గొ ర్రెల మాదిరిగా అమ్మేశాడని ఆరోపించారు.

కనీసం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రజల చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీ తక్కువ అంచనా వేస్తోందని, ప్రజాపాలన అని చెప్పి కోటిన్నర మంది నుంచి దరఖాస్తులు తీసుకొని ఎంతమందికి లబ్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.  ‘రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియదు’ అని కేటీఆర్ హెచ్చరిం చారు.

గ్రూప్- పరీక్షలో జరిగిన అవకతవకలను రాష్ర్ట హైకోర్టు గుర్తించిందని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని కూడా గుర్తించిందని తెలిపారు. మూడు కోట్ల రూపాయ లకు గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారని, ఏ మంత్రి డబ్బు లు తీసుకున్నారో అభ్యర్థులనే అడగాలన్నా రు.

హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే, అత్యాచారాలుగా కనిపిస్తున్నా హోంమంత్రిగా బాధ్యత లు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్పందించలేదని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్ర తలు పూర్తిగా క్షీణించిపోయాయని విమర్శించారు.

‘బీసీ డిక్లరేషన్‌కి సంబంధించి అప్పుడే ఇన్ని షరతులు పెట్టేది ఉండేనా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఖరాఖండిగా చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి గతంలో రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఇస్తే ఉరితీయాలని అన్నారని గుర్తుచేశారు.

అజారుద్దీన్‌కే పెద్ద కట్ కొట్టారు

అజారుద్దీన్‌కు ఎమ్మెల్యే పదవిపై కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని అనుకుంటున్నట్టు చెప్పారు. అజారుద్దీన్ క్రికెట్ లో బాగా కట్‌లు కొట్టే వారని, కానీ కాంగ్రెస్ పెద్దలు అజారుద్దీన్‌కే పెద్ద కట్ కొట్టారని ఎద్దేవా చేశారు. అజారుద్దీన్‌ను సంతృప్తి పరిచేందుకు ముస్లింల ఓట్ల కోసం ఎమ్మెల్సీ అని ప్రకటించారని విమర్శించారు. అజారుద్దీన్ త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారని అన్నారు.