18-09-2025 01:41:59 AM
-కృతికా ఇన్ ఫ్రా డెవలపర్స్ కంపెనీ భారీ దోపిడీ
-బాధితుల ఫిర్యాదుతో ఎండీ శ్రీకాంత్ అరెస్ట్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 17 : ఎల్బీనగర్ లోని కృతిక ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ వెంచర్లు, విల్లాలు, ప్రీలాంచ్ పేరిట కస్టమర్స్ నుంచి రూ. లక్షల్లో వసూలు చేసిన బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు న్యాయం చేయాలని వివిధ పోలీస్ స్టేషన్లలో కృతిక ఇన్ ఫ్రా డెవలపర్స్ ఎండీ దుమావత్ శ్రీకాంత్ పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, శ్రీకాంత్ ను అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. అయితే, ప్రీ లాంచ్ మాయమాటలు నమ్మి మోసపోయిన బాధితుల్లో ప్రస్తుతం 52 మంది వెలుగులోకి వచ్చారు.
వారి నుంచి రూ.20 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలిసింది. శ్రీకాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదని? పలువురు బాధితులు బుధవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులను ప్రశ్నించారు. అనంతరం డీసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీకాంత్ అనేక ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఖరీదైన వెంచర్లు ఏర్పాటు చేసి, అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని ప్రచారం చేశాడని తెలిపారు.
ఈ క్రమంలో ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేశారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ప్రీ లాంచ్ పేరిట దోపిడీ చేశాడని తెలిపారు. దీంతో ఎండీ శ్రీకాంత్ పై ఎల్బీనగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, సైదాబాద్ ఇతర పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. శ్రీకాంత్ తోపాటు తల్లి రాధ, తండ్రి గోపాల్, సోదరుడు శశికాంత్, మార్కెటింగ్ హెడ్ అరుణ్ కుమార్‌తో పాటు పలువురిపై ఎస్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.