తగ్గిన 10 లక్షల ఫాలోవర్లు
ఎంపీ రాఘవ్ చడ్డాకు చేదు అనుభవం
జెన్ జీ వ్యతిరేకతే కారణమా?
ఇంటర్నెట్ జీరోకి కూడా పడేయగలదు: ఎన్సీపీ నేత అనీష్ గవాండే
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 25: సామాజిక మాధ్యమాల్లో భారీ అభిమానాన్ని సాధించుకున్న ఎంపీ రాఘవ్ చడ్డా బీజేపీలో చేరగానే 10 లక్షల ఫాలోవర్లు తగ్గిపోయారు. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న చడ్డా రాజ్యసభలో తనదైన రీతిలో ప్రశ్నలు వేస్తూ నెటిజన్ల మనసు దోచుకున్నారు. ఆప్‌ను వీడాక అభిమానుల నుంచి ఆయన చర్యలపై మిశ్రమ స్పందన లభిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 14.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న చడ్డాకు శనివారం మధ్యాహ్నానికి ఏకంగా 13.5 మిలియన్లకు తగ్గారు. కాగా ఈయన తీసుకున్న నిర్ణయం జెన్ జీ వ్యతిరేకించడమే కారణమై ఉండొచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫాలోవర్లు తగ్గిపోవడంతో ఎన్సీపీ అధికార ప్రతినిధి అనీష్ గవాండే మాట్లాడుతూ.. ఇంటర్నెట్ మిమ్మల్నిరాత్రికి రాత్రే హీరోగా చేయగలదు, అలాగే జీరోకి కూడా పడేయగలదని ఎద్దేవా చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం నచ్చని కారణంగానే 10 లక్షల మంది యువత రాఘవ్ చడ్డాను అన్‌ఫాలో చేశారన్నారు.
కాగా రాజ్యసభలో చడ్డా పేటర్నిటీ లీవులు, ఏయిర్ పోర్టుల్లో తినుబండారాల ధరలు, ఆరోగ్యం, విద్య, సమానత్వానికి సంబంధించిన అంశాలపై వినూత్నమైన ప్రశ్నలు సంధించారు. శానిటరీ ప్యాడ్లు, నీరు, అమ్మాయిలు పాఠశాలకు దూరమైతే అది సామూహిక వైఫల్యమేనని ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. క్విక్ కామర్స్ 10 నిమిషాల డెలివరీలపై కూడా ఆయన మండిపడ్డారు. డెలివరీ బాయ్ ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రశ్నలను కూడా లేవనెత్తారు. 28 రోజుల మొబైల్ రీచార్జీలపై ప్రభుత్వాలను, ఆయా మొబైల్ సంస్థలపై ప్రశ్నలు సంధించారు. ఏది ఏమైనా ఆప్ ను వీడిన ఆయనకు ఫాలోవర్లు పెరుగుతారేమో అనుకుంటే తగ్గడం ఆశ్చర్యకరం.






