16 August, 2026 | 12:46 AM

తెలుగు పల్లె యాస పట్టుకోవడం కష్టమైంది!

16-08-2026 12:00 AM

మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న తాజాచిత్రం ‘ఇరుముడి’. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా కథానాయకి ప్రియా భవానీ శంకర్ చెప్పిన సినిమా విశేషాలు ఆమె మాటల్లోనే.. 

* ‘ఇరుముడి’లో నేను కావేరి పాత్రలో నటించాను. ఆమె సాధారణ గృహిణి. భర్త, కూతురు ఇద్దరే తన ప్రపంచం. కుటుంబాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది. అందరికీ రిలేట్ అయ్యే పాత్ర చేశా. ఇలాంటి పాత్రను ఇప్పటివరకు చేయలేదు. చాలా కొత్త అనుభూతినిచ్చిన్న పాత్ర ఇది. ఇలాంటి పాత్రలను నా నిజ జీవితంలోనూ ఎంతోమందిని చూశా. 

* ఇరుముడి’లో తండ్రీకూతురు మధ్య ఉండే భావోద్వేగాలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆ ఎమోషన్ ఒకేలా ఉంటుంది.  

* రవితేజ అద్భుతమైన ఎనర్జీ ఉన్న యాక్టర్. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. రవితేజ సినిమాలు చూశా. కానీ, ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు మాత్రం నాకు ఒక కొత్త వ్యక్తిలా కనిపించారు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం పొందినట్టయ్యింది. 

* శివ నిర్వాణ నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తారు. సీన్ గురించి నటీనటులతో చర్చిస్తారు. సలహాలు నచ్చితే తీసుకుంటారు. నిజంగా ఇది చాలా మంచి క్వాలిటీ. ఆయన చాలా పాజిటివ్‌గా, కూల్‌గా ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. 

* కావేరి పాత్రకు.. నాకు అసలు పోలిక లేదు. నిజ జీవితంలో నేను కావేరి పాత్రకు భిన్నంగా ఉంటా. ఒక నటిగా ఇలాంటి పాత్రలు చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే తెలుగు విషయంలో కొంత సవాల్ ఎదురైంది. ఎందుకంటే ఇది అర్బన్ తెలుగు కాదు. పల్లెటూరి యాస ఉంటుంది. ఆ లైన్స్‌ను పట్టుకోవడం ఛాలెంజ్‌గా అనిపించింది. 

* దాదాపు 30 రోజులు సీలేరు ప్రాంతంలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నా. అక్కడి లొకేషన్స్ కథకు కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ టోన్‌ను యాడ్ చేశాయి. రిమోట్ ఏరియాస్‌లో షూట్ చేయడం సవాల్‌తో కూడుకున్న పనే. 

* తన పాపను తండ్రి ఎంత ప్రేమ, బాధ్యతతో పెంచుతాడో ‘ఇరుముడి’ ట్రైలర్‌లో చూసి ఉంటారు. అలాగే అమ్మాయి కూడా ఏం జరిగినా పేరెంట్స్‌తో చెప్పడం చాలా ముఖ్యం. అలాంటి సౌకర్యాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచనే వస్తుంది.   

* మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ప్రతి సినిమాను ఎంతో గ్రాండ్‌గా, ప్యాషన్‌తో నిర్మిస్తున్నారు. కష్టతరమైన ఈ సినిమాను వారు నిర్మించడం, వారి నిర్మాణంలో పని చేయడం మంచి అనుభూతినిచ్చింది.  

* నేను చాలా హ్యాపీ పర్సన్‌ను. కాకపోతే ఇప్పటివరకు సీరియస్ పాత్రలు ఎక్కువగా చేశా. మంచి ఫన్ ఉన్న క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను నవ్వించాలని ఉంది. దర్శకుడు శివ నిర్వాణకూ ఇదే చెప్పా (నవ్వుతూ). ‘దూత 2’ -షూటింగ్ ప్రారంభమైంది. అది తొలి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. అలాగే ‘డిమోంటి కాలనీ 3’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.