20-01-2026 01:37:36 AM
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన పాట్లు, ఎదుర్కొన్న వివక్ష మరిచారా?
తెలంగాణవాదుల ఆగ్రహం
సమైక్య పాలకులను ప్రశంసించడం వెనుక మర్మమేమిటి?
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ.. దీక్షలతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రం అనేది రాజకీయ బహుమతి కాదు. లక్షల మంది ప్రజల కల, వేల మంది అమరుల రక్తంతో సాధించిన హక్కు. తెలంగాణ పుట్టుక సాధారణ పరిపాలనా విభజన కాదు. అది దశాబ్దాల అసమానతలకు వ్యతిరేకంగా పుట్టిన ప్రజా ఉద్య మం. అణచివేతలకు ఎదురుతిరిగిన సామూహిక స్వరం.
వేలా ది అమరుల త్యాగాల ఫలితం. నీళ్లు అనే నినాదం చుట్టూ తిరిగిన ఈ పోరాటం కేవలం రాజకీయ డిమాండ్ కాదు.. తెలంగాణ సమాజ ఆత్మగౌరవ ఉద్యమం. ఈ చరిత్ర తెలంగాణ ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగా ఉంది. ప్రతి గ్రామంలో అమర వీరుల స్థూపాలు, ప్రతి కుటుంబంలో ఉద్యమ జ్ఞాపకాలు, ప్రతి తల్లి కళ్లలో కన్నీటి జీరలు. ఇలాంటి రాష్ట్రంలో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వేదికలపై చంద్రబాబు నాయు డు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సంక్షేమానికి ఆదర్శంగా పొగడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రజల్లో గందరగోళం, ఆగ్రహం రేపుతోంది.
వివక్షను మరువలేదు..
సమైక్య పాలనలో తెలంగాణ గడ్డకు జరిగిన అన్యాయాన్ని, వారు చూపిన వివక్షను తెలంగా ణ ప్రజలు ఇంకా మరువలేదు. చంద్రబాబు నాయుడు తెలంగా ణ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవంటూ ప్రజల్లో భయం నింపారు. ఉద్యమాన్ని నీరసపరిచే రాజకీయ వ్యూహాలు రచించారు.
హైదరాబాద్ వనరులు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాలకు తరలించారు. అలాగే వైఎస్‌ఆర్ పాలన కాలంలోనూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తీవ్రంగా అణచివేశారు. ఉద్యమకారులపై కేసులు నమోదయ్యాయి. పోలీసు అణచివేత, అరెస్టులు, నిర్బంధాలు చోటుచేసుకున్నాయి. వందలాది మంది యువకులు అమరులయ్యారు. అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపారు. తెలంగాణ ఆక్షాంకల సాధన కో సం సబ్బండ వర్గాలు ఏకమై పోరాటం చేశా యి. సకల జనుల సమ్మె, సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలను ఉ ధృతంగా చేశారు.
తెలంగాణ ప్రాంతంలోని పార్టీలకు అతీతంగా, జిల్లాలకు, వర్గాలకు, కులాలకు అతీతంగా ప్రజలు పిడికిలి బిగించి స్వరాష్ట్రాన్ని ఏర్పాటు కోసం పోరా టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణపై నిర్ణయం త్వరలో అనే మాటలు మాత్రమే వినిపించాయి. కానీ కార్యాచరణ కనిపించలేదు. అలాంటి తరుణంలో తెలంగాణ ప్రజ ల కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ఏ పార్టీకో, నాయకులకో మాత్రమే పరిమితమయ్యే అంశం కా దు. ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం తెలంగాణ సబ్బండవర్ణాల విజయం.
కొనసాగుతున్న సమస్యలు..
అనేక పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్న తర్వాత కూడా రాష్ట్ర వనరుల వినియోగం, ఉద్యోగాల పంపిణీ, నీటి హక్కులు, విద్యుత్ విధానాలు, ప్రాంతీయ సమతౌల్యం వంటి అంశాలు ఇంకా సమస్యలుగానే కొనసాగుతున్నాయి. ఇలాంటి పరి స్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులను పలు వేదికపై పొగడటం తెలంగాణ ప్రజల్లో అసహనం రేపుతోంది.
ఉద్యమకారుల కు టుంబాల్లో బాధను పెంచుతోంది. తెలంగా ణ పార్టీల మధ్య కొత్త రాజకీయ చర్చను తెరపైకి తెస్తోంది. తెలంగాణ వ్యతిరేక చరిత్ర ఉన్న నేతలను ఎందుకు ప్రశంసిస్తున్నారు? అని బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ప్ర జాసంఘాలు, తెలంగాణ ఉద్యమవాదులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో, ఖమ్మం సభలో బీఆర్‌ఎస్ జెండా దిమ్మెలు కూల్చాలంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం లో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమయ్యా యి.
ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండటం సహజమని, కానీ విధ్వంసానికి తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునివ్వడం ప్రమాదకరమని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల మధ్య, తెలంగాణ ప్రజలు, పార్టీల తరఫున ఒక కీలక ప్రశ్న తెర మీదకు వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి నిజంగా తెలంగాణ పక్షాన నిలబడుతున్నారా?, రాజకీయ అవసరాల కోసం వాస్తవాలను మసకబార్చుతున్నారా? అని ప్రజల్లో సందేహం మొదలైంది.
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజల పక్షాన కొన్ని సూటి ప్రశ్నలు..
* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబును మీరు ఎందుకు ప్రశంసిస్తున్నారు?
* ‘తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు మీకు గుర్తులేవా?
* తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో మీరు మర్చిపోయారా?
* తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలబడిన నాయకుడిని పొగడటం తెలంగాణకు అవమానం కాదా?
* చంద్రబాబు పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రస్తావించరు?
* తెలంగాణ కోసం అమరులైనవారికి ఇది అవమానం కాదా?, వారి వ్యతిరేకులను మీరు వేదికపై పొగడటం భావ్యమేనా?
* ‘ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి’ అంటున్నారు కానీ, ఆ అభివృద్ధి ఎవరి వనరులతో జరిగింది? తెలంగాణ నిధులతో కాదా?
* వైఎస్‌ఆర్ కాలంలో తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా ససేమిరా అన్న విషయం మీకు గుర్తులేదా?
* వైఎస్‌ఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన నష్టంపై మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
* వైఎస్‌ఆర్‌ను స్మరించుకుంటున్న మీరు ఆయన కాలంలో తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను గుర్తు చేసుకుంటారా?
* తెలంగాణ వ్యతిరేకులైన నాయకులను పొగిడితే ఉద్యమకారులకు మీరు ఏ సందేశం ఇస్తున్నారు?
* తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మీరు తెలంగాణ వ్యతిరేక చరిత్ర ఉన్న నేతలను ఎందుకు ఆదర్శంగా చూపిస్తున్నారు?
* రాజకీయ అవసరాల కోసం చరిత్రను మార్చి మాట్లాడుతున్నారా? లేక నిజాలు మర్చిపోయారా?
* ఎన్టీఆర్ పథకాలు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.. కానీ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు చేసిన తెలంగాణ వ్యతిరేక విధానాలను మీరు ఎందుకు ఖండించరు?
* తెలంగాణ ప్రజలు మీ నుంచి ఆశించేది చరిత్రకు న్యాయం చేయడమా? లేక రాజకీయ రాజీనా?
* చివరగా.. రెండుకళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాలని చూస్తున్నారా?
కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిండు.. ప్రతిగా బీఆర్‌ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులకు ఇదే నా విజ్ఞప్తి. తెలంగాణలో ఎన్టీఆర్‌కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. బీఆర్‌ఎసోళ్లు గద్దెలు దిగాలి.. ఊర్లల్లో బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలాలి.. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది.
అప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతాం. ఆ విధంగా మనం ముందుకుపోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమ పథకాల అమలుతో పేదల గుండెల్లో ఇద్దరి పేర్లు శ్వాశ్వతంగా నిలిచిపోయాయి. వారిని మనం స్మరించుకోవాలి. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి.. వారి కండ్లలో ఆనందం చూడాలని రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు.
ఆ రోజు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో బియ్యం పథకాన్ని మేం కొనసాగిస్తున్నం.. నాడు వైఎస్సార్ రైతులకు 7 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. వారి స్ఫూర్తితో నేడు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో కలిసి వివిధ గ్రామాల్లో పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాలు తీసుకెళ్లినం. ప్రజల బాగుకోసం పాటుపడినం.
ఖమ్మం సభా వేదికగా టీడీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు