రోడ్డు కోసం బురదజపం!
నాగర్‌కర్నూల్ 17వ వార్డులో యువకుడి నిరసన
నాగర్‌కర్నూల్, జూన్ 6 (విజయక్రాంతి): అధ్వానంగా మారిన రోడ్డు దుస్థి తిని ఎలుగెత్తి చాటేలా నాగర్‌కర్నూల్ పట్టణంలోని 17వ వార్డు ప్రజలు వినూత్న నిర సన చేపట్టారు. వర్షానికి రోడ్డుపై నిలిచిన నీటిలో కూర్చొని గురువారం ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో సీసీరోడ్డు వేయిస్తానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హామీ నెరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి కాలనీవైపు కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. అస్తవ్యస్తపు డ్రెయినేజీతో మురుగు నీరు మట్టిరోడ్లపైకి చేరి బురదమయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కల్పనభాస్కర్ గౌడ్ తరచూ ఇదేదారిలో వెళ్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా సీసీరోడ్డు వేయించాలని, లేదంటే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. పాలకుల తీరుపై యువకుడు బురదనీటిలో కూర్చోని చేపట్టిన నిరసనకు స్థానికులు మద్దతుగా నిలిచారు.






