మతసామరస్యానికి ప్రతీక మొహర్రం
అలంపూర్, జూన్ 27: మానవపాడు మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి వేడుకల్లో పాల్గొని సోదరభావాన్ని చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సంప్రదాయ డప్పు వాయిద్యాలు, భక్తిగీతాలు, ప్రార్థనల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ వీధుల గుండా పీర్ల ఊరేగింపు వైభవంగా సాగగా, మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొహరం వేడుకలు మత భేదాలకు అతీతంగా ఐకమత్యం, పరస్పర గౌరవం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.






