12 July, 2026 | 4:29 PM

అయ్యో ముంబై

04-05-2024 01:10 AM

ఈ సీజన్‌లో ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. బౌలర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని ఆనందించే లోపే.. బ్యాటర్లు విఫలమై స్వల్ప లక్ష్యాన్ని కూడా కొండంత చేసుకున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. 

ఐపీఎల్లో ఎనిమిదో పరాజయం

ముంబై పేసర్ నువాన్ తుషారా దుమ్మురేపడంతో కోల్‌కతా 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. కష్ట సమయంలో  వెంకటేశ్ అయ్యర్ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కు పోరాడే స్కోరు అందించాడు. రోహిత్, సూర్య, ఇషాన్, తిలక్, పాండ్యా, డేవిడ్, నేహల్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్ ముందు 170 పరుగుల లక్ష్యం ఒక లెక్కా అని భావిస్తే.. దాన్ని ఛేదించలేక ముంబై చతికిలబడింది. ఈ విజయంతో కోల్‌కతాప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. 

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. గత కొద్ది మ్యాచ్‌లుగా బ్యాటర్ల బాదుడుతో భారీ విజయాలు ఖాతాలో వేసుకుంటున్న కోల్‌కతా ఈ సారి బౌలింగ్‌లో సత్తాచాటింది. శుక్రవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 24 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు.


ఫిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8), రఘువంశీ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), రింకూ సింగ్ (9), రస్సెల్ (7) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో నువాన్ తుషార, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం ఫలితాన్నివ్వలేదు. ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ (11), నమన్ ధిర్ (11), తిలక్ వర్మ (4), నెహల్ వధేర (6), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ (24) పోరాటం ఒటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 4, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రస్సెల్ తలా 2 వికెట్లు పడగొట్టారు. వెంకటేశ్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.  

రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా.. 

యువ పేసర్ నువాన్ తుషార రాణించడంతో మ్యాచ్ ఆరంభంలోనే ముంబైకి పట్టుచిక్కింది. తొలి ఓవర్‌లోనే ప్రమాదక ఓపెనర్ సాల్ట్‌ను అతడు బుట్టలో వేసుకున్నాడు. సాల్ట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ చక్కగా అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో కోల్‌కతాకు డబుల్ స్ట్రోక్ తగిలింది. రఘువంశీతో పాటు శ్రేయస్ అయ్యర్‌ను నువాన్ వెనక్కి పంపాడు. ఈ మధ్యలో సునీల్ నరైన్‌ను పాండ్యా క్లీన్ బౌల్డ్ చేయగా.. రింకూ సింగ్‌ను పియూష్ చావ్లా రిటర్న్ క్యాచ్ ద్వారా డగౌట్ బాట పట్టించాడు. దీంతో 57 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరిపోయింది. ఇంకేముంది మరికాసేపట్లో కోల్‌కతా కథ ముగిసినట్లే అనుకుంటుంటే.. వెంకటేశ్ అయ్యర్ మొండిగా పోరాడాడు.

మరో ఎండ్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన మనీశ్ పాండే అతడికి అండగా నిలువడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ గాడిన పడింది. ఇక సులువైన లక్ష్యఛేదనలో ముంబై దంచికొడుతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా జరిగింది. సాదారణంగా ముంబై జట్టులో సూర్యకుమార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం ఆనవాయితీ కాగా.. ఈసారి రోహిత్ ఇంపాక్ట్ గా జట్టులోకి వచ్చాడు. వాంఖడేలో కోల్‌కతా స్పిన్ ద్వయం నరైన్, వరుణ్ చక్రవర్తి బంతిని గింగిరాలు తిప్పుతుండటంతో పరుగుల రాక గగనం కాగా.. వరుస విరామాల్లో ముంబై వికెట్లు కోల్పోయింది. ఇషాన్‌తో మొదలైన పతనం చివరి వరకు కొనసాగింది. టాపార్డర్ విఫలమైన సమయంలో బాధ్యత తీసుకొని ఆడుతున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ కూడా ఈ సారి కాడి ఎత్తేయగా.. సూర్యకుమార్ కాసేపు దూకుడుగా ఆడి అభిమానులను అలరించాడు. 

సంక్షిప్త స్కోర్లు

కోల్‌కతా: 19.5 ఓవర్లలో 169 ఆలౌట్ (వెంకటేశ్ 70, పాండే 42; బుమ్రా 3/18, నువాన్ 3/42), ముంబై: 18.5 ఓవర్లలో 145 ఆలౌట్ (సూర్య56; స్టార్క్ 4/33).