calender_icon.png 21 February, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమనగల్లులో మాటల మంటలు

21-02-2026 12:13:52 AM

బీజేపీ నేత ఆచారి వర్సెస్ బీఆర్‌ఎస్ నేత ఉప్పల వెంకటేశ్

తెరపైకి రేషన్ బియ్యం దందా 

ఒకరిపై మరొకరు పరస్పర తీవ్ర ఆరోపణలు 

ఏఐ వీడియోలతో సోషల్ మీడియాలో పోటాపోటీగా సెటైర్లు

ఇరుపార్టీల మధ్య చిచ్చురాజేసిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

కాంగ్రెస్- బీజేపీ అనైతిక పొత్తుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

రంగారెడ్డి, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నిక ఘట్టం బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య కొత్త చిచ్చురాజేసింది. నిన్న మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న రాజకీయం.. ఇప్పుడు ఒక్కసారిగా నేతల మధ్య హెచ్చరికలు, పరస్పర ఆరోపణలతో హాట్ హాట్ గా మారింది. బీఆర్‌ఎస్ నేత ఉప్పల వెంకటేశ్, బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం దందా అంశం తెరపైకి తెచ్చి ఇద్దరు హేమాహేమీ నేతల మధ్య  డైలాగ్ వార్ నడుస్తున్నది. రాజకీయపరంగా, వ్యక్తుల పరస్పర ఆరోపణలు తీవ్రస్థాయికి వెళ్లాయి.

ఈ వివాదంలో గతంలో చేసిన వ్యాపారం, ప్రస్తుతం చేస్తున్న రియల్ వ్యాపారాలపై ఇరు నేతలు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం గమనార్హం.‘నువ్వు చేస్తున్నావంటే కాదు.. నువ్వే చేస్తున్నావ్’ అంటూ ఆచారి, ఉప్పల వెంకటేష్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో మీరు చేసిన పాపాలు ఇవి అంటూ మరొకరు. ఈ వివాదంలో అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం ప్రస్తావన కూడా వచ్చింది.... నిజానిజాల కంటే కూడా, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు టార్గెట్ చేసుకోవడం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగింది?

ఇటీవలి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమనగల్లు మున్సిపల్ లో మొత్తం 15 వార్డులు ఉండగా, ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. 8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన బీఆర్‌ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ ఆరు స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క వార్డులో మాత్రమే గెలిచింది. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చైర్మన్ పదవి బీఆర్‌ఎస్కు దక్కాలి. కానీ, తెరవెనక జరిగిన చీకటి ఒప్పందాలు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి.

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ పత్యానాయక్ ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ లో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. బీజేపీ సీనియర్ నేత టి.ఆచారి సతీమణి తల్లోజు గీత మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యింది.దీంతో మెజార్టీ ఉన్నప్పటికీ అధికారం దూరమైందని బీఆర్‌ఎస్ నేతలు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేత ఉప్పల వెంకటేశ్ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు. వారు సైతం దీటుగానే స్పందిస్తున్నారు.

ఏఐ వీడియోలతో ఎదురుదాడి

కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ఈ మాటలయుద్ధం డిజిటల్ స్క్రీన్ల మీదకు చేరింది. ఏఐ ఇమేజ్లు, వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టులు వెలుస్తున్నాయి. కార్యకర్తలు కూడా ఒక అడుగు ముందుకు వేసి, ప్రత్యర్థి నేతలను కించపరిచేలా వీడియోలు, మీమ్స్ వదులుతున్నారు. ఇది చూస్తున్న సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది. నేతల మధ్య ఉన్న వైరం వ్యక్తిగత దూషణల స్థాయికి పడిపోవడంపై ఆవేదన వ్యక్తమవుతున్నది. ఆమనగల్లు మున్సిపాలిటీ సాక్షిగా సాగుతున్న ఈ రాజకీయ వ్యవహారంలో నేతలు ఒకరికొకరు కత్తులు నూరుకుంటున్నారు. అభివృద్ధి పనుల కంటే, పరస్పర విమర్శలకే ప్రాధాన్యత పెరగడంతో స్థానిక పరిపాలన కూడా పక్కదారి పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చర్చనీయాంశంగా విమర్శలు ఈ గొడవ కేవలం ఆమన గల్లుకే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ఒక సరికొత్త చర్చ నడుస్తున్నది. ‘కొన్నిచోట్ల కుమ్మక్కు, మరికొన్ని చోట్ల కొట్లాట.. అసలు కాంగ్రెస్- బీజేపీ మధ్య నడుస్తున్న ఈ అనైతిక పొత్తు ఏంటి?’ అని నెటిజన్లు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఓ ప్రాంతంలో కలిసి ఉంటూ, మరో ప్రాంతంలో కత్తులు దూసుకోవడం వెనక ఉన్న వ్యూహాలు ఏమిటని చర్చించుకుంటున్నారు. ఆమనగల్లు రాజకీయాల్లో రేగిన ఈ మంటలు చల్లారుతాయా? లేక మరింత ఉగ్రరూపం దాలుస్తాయా? అన్నది వేచిచూడాలి. ఏదేమైనా నాయకుల మాటల మంటలు ప్రజల్లో మాత్రం అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.