22 August, 2026 | 4:21 PM

మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్

22-08-2026 03:45 PM

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కమిషనర్...

బాన్సువాడ,ఆగస్టు 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాన్సువాడ మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) గోపు గంగాధర్ బాన్సువాడ మండలం బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని డ్రాప్‌బాక్స్‌లో అందిన ఫిర్యాదులను పరిశీలించి, వాటి వివరాలపై ఆరా తీశారు.అనంతరం విద్యార్థులతో కమిషనర్ నేరుగా మాట్లాడారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అందిస్తున్న బోధనా విధానం, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న విద్యా నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో వంటకు సంబంధించిన సామగ్రి, స్టాక్ రిజిస్టర్లను కమిషనర్ పరిశీలించారు. వంటకు వినియోగిస్తున్న సరుకుల నిల్వలను తనిఖీ చేసి, అవి తాజాగా, నాణ్యతగా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.తనిఖీ అనంతరం కమిషనర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. హాస్టల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య, ఆహారం అందేలా సంబంధిత సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.