12-02-2026 12:32:36 AM
పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు.
కోదాడలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ దంపతులు
సూర్యాపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ తో పాటు 18 మునిసిపాలిటీలకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ సాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు చెదురు మొదలు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
వీటీలో సూర్యాపేట జిల్లాలో 141 వార్డులకు గాను కోదాడలో 3, హుజూర్ నగర్ లో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరిపించారు. వీటిలో మొత్తం 2,19, 972 మంది ఓటర్లు ఉండగా 1,75,759 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 81.18 పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలలో సూర్యాపేటలో 48 వార్డులకు గాను 1,08,848 ఓటర్లు ఉండగా 86,403 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 78.97 శాతంగా నమోదయింది.
కోదాడలో 35 వార్డులకు గాను 3 ఏకగ్రీవం కాగా మిగిలిన వార్డుల్లో 53,056 మంది ఉండగా 40,881 మంది ఓటు వేయడంతో 83.87 శాతంగా నమోదైంది. హుజూర్నగర్ లో 28 వార్డులు ఉండగా ఒకటి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27 వార్డులలో 28,867 మంది ఉండగా 23,926 మంది ఓటు వేయగా 82.88 శాతంగా నమోదైంది. నేరేడుచర్ల లో 15 వార్డులలో 13,746 మందికి గాను 10,893 ఓటు వేయడంతో 77.57 శాతం, తిరుమలగిరిలో 15 వార్డులకు గాను 15,455 మంది 13,696 మంది ఓటు వేయడంతో 88.50 శాతంగా నమోదయింది.
ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తమవెంట తెచ్చుకుని ఓటు వేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అయితే అభ్యర్థుల భవితవ్యం బ్యాలె ట్ బాక్సులలో ఉండడంతో వాటిని లెక్కేసేందుకు కొంత సమయం పడుతున్నందున ఈ నెల 13న ఫలితం రావడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
జిల్లాలోని కోదాడ పట్టణంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి 14వ వార్డులోని 34వ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని 14 వ వార్డు కృష్ణానగర్ 34వ పోలింగ్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తన ఓటు హక్కుల విని యోగించుకున్నారు. అలాగే 44వ వార్డులోని సిద్ధార్థ హై స్కూల్లో మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పలుచోట్ల వాగ్వాదం
సూర్యాపేటలోని 25 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష శివ యాదవ్ తనను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అధికార పార్టీ పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. అలాగే 45 వార్డులోని బిఆర్‌ఎస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగించారు.
నల్లగొండ, హాలియాలలోను దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆందోళ న చేపట్టారు. ఇతర దేశాలలో ఉన్నవారు ఓటు వేశారు అంటూ బిఆర్‌ఎస్ నాయకు లు ఆందోళనకు దిగారు. నల్లగొండలో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకున్ని పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదంటూ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ఆందోళన చేపట్టారు.
అధికారుల పరిశీలనలు
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్షర హైస్కూల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ఎస్పీ నరసింహ కోదాడలో జరుగుతున్న ఎన్నికల సర్వేని పరిశీలించారు.
అలాగే సాధారణ ఎన్నికల పరిశీలకులు పాండుదాస్ సూర్యాపేట, తిరుమలగిరి లతోపాటు వాళ్ళచోట్ల జరుగుతున్న ఎన్నికల సర్వేని పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి ఒకటి రెండు చిన్న ఎదురు మొదలు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.