సుల్తానాబాద్ లో విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసన దీక్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ శుక్రవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి, నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) సుల్తానాబాద్ మున్సిపాలిటీ కమిటీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన దీక్షలు చేశారు. ఇందులో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎరవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 లు నిర్ణయిస్తామని, మిగతా సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు.
రెండున్నర సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ఏ ఒక్కటి అమలు చేయ లేదని ,పైగా మున్సిపల్ కార్మికులు అనారోగ్యం బారిన పడిన, చనిపోయిన, రిటైర్మెంట్ అయినా వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం పెట్టుకోవాలని నిబంధన గతంలో ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉన్న హక్కును కూడా తొలగిస్తూ మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నది, అదేవిధంగా ఉల్తానాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వవలసిన బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగులో ఉన్నాయని అనేకసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసిన ఇప్పటివరకు ఇవ్వలేదని, వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అన్నారు, అందులో భాగంగా జూన్ 22న చలో కలెక్ట నిర్వహిస్తున్నామని అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు,ఈ నిరసన దీక్షలలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పాక మహేష్, సిఐటియు మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు న్యాతరి రమేష్, ఆరేల్లి సురేష్, నాయకులు మాతంగి రాజమల్లు, మహంకాళి మల్లేష్, శ్రీనివాస్,చిలుముల రామ్మూర్తి, న్యాతరి లక్ష్మి, లతా, ఓదెలు,మధు,నర్సింగం తదితరులు పాల్గొన్నారు.






