ముస్లిం మహిళల ఓట్లు మోదీకే

19-04-2024 01:59:29 AM

l మూడోసారి ప్రధాని కావడం ఖాయం

l రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ తగ్గుతోంది

l బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): దేశంలో మోదీ హవా నడుస్తోం దని, మూ డోసారి ఆయనే ప్రధానమంత్రి అవుతారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు సైతం ఆయనకు ఓటేసేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు. అన్ని పార్టీల సానుభూతిపరులు సైతం మోదీనీ మూడోసారి ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో మాజీ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ నాయకుడు కాటేపల్లి జనార్దన్ రెడ్డి సహా పలువురు నాయకులు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయసు పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ తగ్గుతోందని విమర్శించారు. మోదీ సాహసోపేత నిర్ణయాల మీద మాట్లాడేందుకు రాహుల్‌కు నోరు రావడం లేదన్నారు.

ఎన్నికల బాండ్లకు ముందు నల్లధనం విచ్చలవిడిగా ఉండేదని... బాండ్ల జారీతో పారదర్శకత వచ్చిందన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ విరాళాలు పొందలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐను అడ్డుపెట్టుకుని బీజేపీ విరాళాలు సేకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఉత్తరాదిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని... దక్షిణాదిన సైతం అదే పరిస్థితి వస్తుందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ మాదిరిగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.