నా కల నెరవేరింది
‘ముంజ్యా’, ‘వేదా’ చిత్రాలతో మంచి విజయం సొంతం చేసుకున్న బాలీవుడ్ కథానాయిక శార్వరీ వాఘ్.. ప్రస్తుతం ‘ఆల్ఫా’ చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గౌరవమే కాకుండా బాధ్యత అని శార్వరీ వాఘ్ తెలిపారు. ఈ చిత్రంలో ఆలియా భట్‌తో కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు. శివ్ రావెల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శార్వరీ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.
“యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ఎన్నో చిత్రాల్లో గూఢాచారులుగా నటించిన సూపర్‌స్టార్‌లకు నేను వీరాభిమానిని. చిన్న వయసులోనే స్పై కుటుంబంలోకి రావడం నా అదృష్టం. స్పైగా నటించాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆదిత్య చోప్రా నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని నా పనితోనే ప్రతి ఒక్కరికీ సమాధానం చెబుతా” అని శార్వరీ వాఘ్ తెలిపారు.‘ఆల్ఫా’ చిత్రం 2025 డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.






