నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి, కానీ..

10-07-2024 12:05:00 AM

ప్రభాస్ సహా పలువురు భారతీయ ఉద్ధండ నటులతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి2898ఏడీ’. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మైలురాయికి అత్యంత చేరువగా ఉంది. ఈ నిర్మాణ సంస్థను స్థాపించి అర్ధ శతాబ్ది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి, తమ సంస్థ గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు. ‘జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి. కానీ, ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. మా ఇంటికి హడావుడిగా వస్తాడు.. చెప్పులు బయటే విడిచి లోపలికి వస్తాడు.

వెళ్లేటప్పుడేమో నా చెప్పులు వేసుకొని వెళ్లిపోతాడు.. ఆశ్చర్యం ఏమిటంటే, వచ్చేటప్పుడు వాళ్ల నాన్న చెప్పులు తొడుక్కొని వస్తాడు’ అంటూ  నాగ్ గురించి సరదా విషయాలను పంచుకున్నారు. తమ నిర్మాణ సంస్థ గురించి చెప్తూ.. “1947లో మొదలైన వైజయంతీ మూవీస్ ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ‘ఎదురు లేని మనిషి’ నుంచి ‘కల్కి2898ఏడీ’ వరకు ఎన్నో విజయాలు సొంతమయ్యాయి. తుఫాను సమయంలోనూ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రికార్డులు సృష్టించింది” అంటూ విజయాలను గుర్తు చేసుకున్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటినా.. నా మొదటి సినిమా నుంచీ దర్శకుడు చెప్పింది విని, వారి విజన్‌కు ఏం కావాలో అవి ఇస్తూ వచ్చాను. ఇదెందుకు? అని ఎప్పుడూ దర్శకుడితో చర్చించలేదు. ఆ రోజుల్లో నిర్మాతలుగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లలో నేనూ, అల్లు అరవింద్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాం. పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురవుతాయి.. సవాలుగా తీసుకొని ముందుకు సాగాలి’ అంటూ స్ఫూర్తి వచనాలు చెప్పారు అశ్వినీ దత్.