21 July, 2026 | 7:08 AM

సింగరేణి అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

20-07-2026 04:14 PM

భూమిని చదును చేసి అప్పగించాలి

ఇంటి స్థలాల విషయంలో ఆర్డిఓ, సింగరేణి జిఎంకు నగరంపల్లి లబ్ధిదారుల వినతి

గణపురం,(విజయక్రాంతి): సింగరేణి అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తమకు కేటాయించిన స్థలాన్ని చదును చేసి హద్దులు ఏర్పాటు చేసి ఇవ్వాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామపంచాయతికి చెందిన 83 మంది లబ్ధిదారులు తమ సమస్యను ఆర్డిఓ హరికృష్ణ సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి లకు వినతిపత్రం ద్వారా సోమవారం తెలిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో 1994- 95 సంవత్సరంలో దారిద్ర రేఖకు దిగువనున్న 83  కుటుంబాలకు భూమిని కేటాయించారు.

ప్రస్తుతం ఆ భూమి ఓ సి త్రీ పరిధిలోని నగరంపల్లి శివారులో ఉండడంతో సింగరేణి సంస్థ లబ్ధిదారుల భూములను స్వాధీనం చేసుకుని చెల్పూర్ శివారు ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో భూమిని కేటాయించారు. భూమిని కేటాయించి రెండు సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు వారికి కేటాయించిన భూమిని చదును చేయకపోవడంతో పాటు సరైన హద్దులు లేకపోవడంతో లబ్ధిదారులు తమ సమస్యను వివరించారు. లబ్ధిదారులకు భూమి ఇచ్చి పట్టాలు అందజేసినప్పటికీఆ భూమిని సరిచేసి ప్లాట్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆ భూమిలో చెట్లు, గుంతలు, ఎత్తుపల్లాలు ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భూమిని సవ్యంగా సర్ది, ప్లాట్ నెంబర్ల ప్రకారం కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా పలుమార్లు ప్రజావాణిలో వినతులు ఇచ్చినా పరిష్కారం కాలేదని, తమ సమస్యను పరిష్కరించి భూమిని సర్దుబాటు చేసి ప్లాట్లు కేటాయించాలని అధికారులను కోరారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు సహకరించాలని వినతిలో పేర్కొన్నారు.