7 March, 2026 | 10:45 PM

జనం నుండి వనంలోకి

07-03-2026 08:53 PM

* ముగిసిన నాగులమ్మ జాతర

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో ఈ నెల 3 వ తేదీ నుండి జరుగుతున్న మహా జాతర శనివారం అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో ముగిసింది. ఈ ఐదు రోజులు భక్తుల పూజలు, శివ సత్తుల పూనకాలు, దింసా నృత్యాలు, గుస్సాడి నృత్యాలు, గిరిజన సంప్రదాయం ఉట్టి పడే పలురకాల విన్యాసాలు తదితర కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం సందడి సందడిగా ఉంది.

శనివారం ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ (దేవర బాల), పూజారులు బాడిశ నాగ రమేష్, బాడిశ నవీన్, కొమురం ధనలక్ష్మి, వడ్డెలు, పూజారులు, ఆర్తిలు ఆధ్వర్యంలో జలాభిషేకాలు, జెండా కర్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జాతరలో చివరి రోజున మణి రూపంలో ఉన్న నాగులమ్మ అమ్మవారికి, సడాలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన పూజారులు గండోర్రె గుట్టకు నాగులమ్మను, ఎర్రెట్టల గుట్టకు సడాలమ్మను డోలు వాయిద్యాల నడుమ సాగనంపారు. ఈ సందర్భంగా భక్తులు చల్లగా కాపాడమని నాగులమ్మను వేడుకున్నారు. జాతరలో చివరి రోజు శనివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవత తిరిగి వన ప్రవేశం చేయడంతో శనివారంతో జాతర ముగిసింది.