16 July, 2026 | 2:09 PM

ఎన్టీఏపై సుప్రీంకోర్టు మండిపాటు

19-06-2024 12:33 AM
  • 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాలి

పరీక్షల విషయంలో న్యాయంగా వ్యవహరించాలి

న్యూఢిల్లీ, జూన్ 18: వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండి పడింది. ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించే సంస్థ న్యాయంగా వ్యవహరించాలి. తప్పిదం జరిగితే అంగీకరిం చాలి. ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదు. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

ఎన్టీఏ నుంచి చర్యలు ఆశిస్తున్నాం

ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సకాలంలో చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అంతకుముందు ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నీట్ పరీక్ష పవిత్రతకు భంగం కలిగిందని వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏపైనే ఉందని తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరగడం వల్ల ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది.  

* దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణపై విద్యార్థులు, విపక్ష పార్టీలు ధర్నాలు చేస్తున్నా, ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదు?.  24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నా ఎప్పటిలాగే ఏమీ పట్టనట్లు మోదీ మౌనం వహిస్తున్నారు. ఎన్డీయే పాలిత బీహార్, గుజరాత్, హర్యానాల్లో జరిగిన అరెస్టులు నీట్‌లో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నిదర్శనం.

 కాంగ్రెస్ అగ్రనేత 

రాహుల్ గాంధీ