16 April, 2026 | 3:10 AM

మహిళా ఉద్యోగులతో నమాజ్!

16-04-2026 01:29 AM

అసభ్యంగా ప్రవర్తించిన నిందితులు

శిక్షణలో హిందూ దేవతలపై అవహేళన

నాసిక్ టీసీఎస్ కేసులో మొత్తం 9 ఎఫ్‌ఐఆర్‌లు, ఏడుగురు నిందితులు అరెస్టు

ముంబై, ఏప్రిల్ 16: నాసిక్‌లోని టీసీఎస్ బీపీఓ విభాగంలో మతమార్పిడి, వేధింపుల కేసు కొత్త మలుపు తీసుకుంది. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు నిందితులతో సహా ఒక మహిళా హెచ్‌ఆర్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు చార్జిషీట్‌లో విస్తుపోయే నిజాలు వెల్లడైనట్లు సమాచారం. మహిళా ఉద్యోగులతో నిందితులు బలవంతంగా నమాజ్ చేయించడం, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఒప్పుకోని వారిపై పనిభారం వేయడం, శిక్షణలో హిందూ దేవతలపై అవహేళన చేసినట్లు తేలిందని తెలిసింది. అలాగే టెక్‌మహీంద్ర, విప్రో తదితర ఐటీ కంపెనీల్లో కూడా నాసిక్ టీసీఎస్ ఘటనలే జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

నాసిక్ టీసీఎస్ కేసులో నిందితులు ఒక పద్ధతి ప్రకారం అమాయక మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి మాయమాటలతో లొంగదీసుకున్నారు. శిక్షణ సమయంలో హిందూ దేవతలపై తక్కువ చేసి మాట్లాడేవారు. బాధితులు మనస్తాపానికి గురైనప్పుడు నిదాఖాన్ అనే హెచ్‌ఆర్ మేనేజర్ సానుభూతి నటించేవారు. అలా వారి నమ్మకాన్ని గెలుచుకుని మెల్లగా జీవనశైలిని మార్చేవారు. ఒక బాధితురాలు తన ఇంట్లో దేవుడి ఫొటోలు తొలగించి, కుటుంబంతో గొడవ పడే స్థాయికి వెళ్లారు.

ఈ కుట్రను బయటపెట్టడానికి పోలీసులు మారువేషాల్లో కార్యాలయంలోకి ప్రవేశించారు. మహిళా పోలీసులు హౌస్ కీపింగ్ సిబ్బందిగా వచ్చి అక్కడి పరిస్థితులను గమనించారు. నిందితుల ఫోన్లను తనిఖీ చేయగా వాట్సాప్ గ్రూపుల ద్వారా చేసిన ప్రణాళికలు బయటపడ్డాయి. మహిళా ఉద్యోగినుల పట్ల నిందితులు అసభ్యంగా ప్రవర్తించేవారు. మాట వినని వారిపై పనిభారం పెంచి వేధించేవారు. ఈ విషయాలపై హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పైగా ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులకే వత్తాసు పలికారు. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారిస్తోంది.

నిందితుల బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై టీసీఎస్ యాజమాన్యం కఠినంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, ఇలాంటి పనులను తాము అస్సలు సహించబోమని కంపెనీ స్పష్టం చేసింది. సీట్‌ను ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్ణవీస్ కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, పూర్తి దర్యాప్తునకు ఆదేశించారు. అయితే హిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే.

మతోన్మా దంతో ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం జరగాలి! టాటా గ్రూప్‌లో ఇలాంటి సంఘటన జరగడం అత్యంత బాధాకరం అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సంఘటనలు టెక్ మహీం ద్రా, విప్రో వంటి ఇతర ఐటీ కంపెనీల్లో కూడా జరుగుతున్నాయి అని ఇప్పుడు కొందరు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నెట్వవర్క్‌లు ఇంకెన్ని పనిచేస్తున్నాయి అనే దానిపై పెద్దఎత్తున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. 

మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు

మార్చి26న ఒక మహిళా ఉద్యోగి తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో, జీవనశైలిలో హఠాత్తుగా మార్పు వచ్చిందని, ఆమెపై ఏదో ప్రభావం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగిని కూడా తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక సహా ఉద్యోగి రేప్ చేసాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఫిర్యాదుపై జరిగిన దర్యాప్తులో మరికొంత మంది బాధితులు అంటే మొత్తం 8 మంది మహిళలు + 1 పురుషుడు కూడా ముందుకు వచ్చారు. వారంతా తాము 2022 నుంచి 2026 వరకు లైంగిక వేధింపులు, మత మార్పిడి, హిందూ దేవతలను అవమానించడం, నమాజ్ చేయమని బలవంతం చేయడం వంటి ఒత్తిడికి లోనయ్యామని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.