18 June, 2026 | 1:53 AM

అసంపూర్తిగా జాతీయ రహదారి పనులు

18-06-2026 12:00 AM
  1. నరకప్రాయంగా మారిన శంషాబాద్ జర్నీ 
  2. నిలిచిపోయిన ఎన్‌హెచ్ 44 విస్తరణ, మరమ్మతులు
  3. ట్రాఫిక్ జాంలు, కమ్ముకుంటున్న దుమ్ము.. 
  4. నిత్యం ప్రమాదాల భయం
  5. వర్షాకాలం వస్తే పరిస్థితి మరీ ఘోరం.. 
  6. పట్టించుకోని అధికారులు

షాద్నగర్, జూన్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని కలుపుతూ నిత్యం వేలాది వాహనాలతో బిజీగా ఉండే శంషాబాద్  కొత్తూరు జాతీయ రహదారి (ఎన్హెచ్44) విస్తరణ, మరమ్మతు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా పనులు మధ్యలోనే ఆగడంతో ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. నిత్యం ట్రాఫిక్ జాంలు, దట్టంగా కమ్ముకుంటున్న దుమ్ముతో ఊపిరాడక స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి, విద్యపై తీవ్ర ప్రభావం:

ముఖ్యంగా కొత్తూరు, నందిగామ, తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు, ఐటీ కారిడార్ ఉద్యోగులు, నిత్యం వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు ఉండటంతో స్కూల్, కాలేజీ బస్సులు సకాలంలో చేరుకోలేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డు తవ్వి అలాగే వదిలేయడంతో వాహనాలు వెళ్తున్నప్పుడు లేస్తున్న దుమ్ము కారణంగా స్థానిక దుకాణదారులు, రోడ్డు పక్కన నివసించే ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అటు దుమ్ము సమస్య, ఇటు ఎప్పుడు ఏ వాహనం దూసుకొస్తుందో తెలియని ప్రమాదకర స్థితితో ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.

ముంచుకొస్తున్న వర్షాకాలం.. పెరగనున్న ముప్పు:

ఇప్పటికే అక్కడక్కడా కురుస్తున్న తొలకరి జల్లులకే రోడ్డంతా బురదమయంగా మారుతోంది. వర్షాకాలం పూర్తిగా ముంచుకొస్తే ఈ అసంపూర్తి రోడ్లు కాస్తా మృత్యుకూపాలుగా మారే ప్రమాదం ఉందని వాహనదా రులు హెచ్చరిస్తున్నారు. గుంతల్లో నీరు చేరి రాత్రి వేళల్లో బైక్లపై వెళ్లేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ జాతీయ రహదారి సమస్యపై ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదు? అధికారులు ఎందుకు ప్రత్యేక దృష్టి సారించడం లేదు?‘ అని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కాలయాపన చేయకుండా, తక్షణమే ఉన్నతాధికారు లు స్పందించి నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పునఃప్రారంభించాలని, త్వరితగతిన పూర్తి చేసి తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.