ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
మహబూబాబాద్,(విజయక్రాంతి): క్రీడలతోనే క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనం లభిస్తుందని, చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని జిల్లా యువజన & క్రీడల అధికారి డాక్టర్ ఓ. జ్యోతి పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు, "ఖేలేగా భారత్ జీతేగా భారత్" నినాదంతో ఆగస్టు 28 నుండి 30 వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు(National Sports Day Celebrations) మహబూబాబాద్‌లోని టి.జి.ఎం.ఆర్.ఎస్ (TGMRS) బాలుర పాఠశాల1లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన, క్రీడల అధికారి జ్యోతి హాజరై ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి మరియు శారీరక దృఢత్వం అలవడతాయన్నారు. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆటలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.






