28 August, 2026 | 3:46 PM

రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్

28-08-2026 01:40 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): భారతదేశం తన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు, బంధుత్వాలకు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని, రక్షాబంధన్‌(Raksha Bandhan) పండుగ మన బంధాలకు ప్రతీక అని ఆదిలాబాద్‌ ప్రజలకు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ పేర్కొన్నారు. రక్షాబంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజక వర్గం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుందని, అందులో రక్షాబంధన్‌ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచం భారతీయ సంస్కృతి వైపు చూస్తోందంటే దానికి ప్రధాన కారణం మన కుటుంబ వ్యవస్థ, మానవీయ విలువలు, సోదరభావం, బంధాలకు ఇచ్చే ప్రాధాన్యత అని ఎమ్మెల్యే అన్నారు. ఇవే భారతదేశానికి ఉన్న అసలైన బలమని తెలిపారు. “నువ్వు నాకు రక్ష… నేను నీకు రక్ష… మనమంతా కలిసి దేశానికి రక్ష” అనే భావనతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా, పరస్పరం సహకరించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రక్షాబంధన్‌ స్ఫూర్తితో ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు పెరగాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్‌ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సోదరీమణులు నీలిమ, రేవతి, రమ, అనిత, శాంతిలు రాఖీ కట్టారు.