29 August, 2026 | 11:42 PM

జిల్లాలో ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలు

29-08-2026 09:49 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, ఐటిడిఎ స్పోర్ట్స్ పాఠశాలలు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు.

క్రీడాకారుల ప్రగతికి అవసరమైన మౌలిక వసతులు, కోచ్‌లు, ప్రిన్సిపాల్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూడో, హాకీ తదితర విభాగాలలో జిల్లా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించారు. అనంతరం జిల్లాలోని పలువురు పూర్వ క్రీడాకారులను శాలువాలతో సత్కరించి, మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్‌ఓ దయానంద్ రెడ్డి, ప్రముఖ క్రీడాకారులు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.