కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై దమ్మపేటలో సమరశంఖం
పార్టీ ఏది ఆదేశిస్తే... దానికోసమే మనం పని చెయ్యాలి: మాజీ ఎంఎల్ఏ మెచ్చా
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలోని వినాయక ఫంక్షన్ హాల్ నందు అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంచార్జ్ ఉప్పల వెంకట రమణ హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో కార్యకర్తలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పార్టీలో వర్గపోరును సహించేది లేదని, అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తే నాతో సహా ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకునేందుకు పార్టీ వెనుకాడదని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 సంవత్సరాలు ఉండగానే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, శ్రేణులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని మండలాలకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. కేసీఆర్ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే వారి గెలుపు కోసం అంతా కష్టపడి పనిచేయాలని అన్నారు. ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక కార్డు ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న మంత్రి భట్టి విక్రమార్క ఇప్పుడా కార్డును ప్రజలు ఎక్కడ పెట్టుకోవాలో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో 'అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్' నడుస్తోందని, సాక్షాత్తూ మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలే ఈ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి తీరుతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కేంద్రం ఇచ్చే 75% నిధులు సైతం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని, నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో తెలియజేస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరిచేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల మాజీ అధ్యక్షులు, మండల నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






