ధ్యానం, యోగాతోనే మానసిక ప్రశాంతత
గడ్డిపల్లి మోడల్ స్కూల్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్
గరిడేపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు ఏకాగ్రత, సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కనహ శాంతివనం ప్రతినిధులు నిర్మల, ఆనంద్, సూర్యాపేట లోకల్ సెంటర్ ప్రతినిధి గోవర్ధన్ సూచించారు. పీఎం శ్రీ గడ్డిపల్లి మోడల్ స్కూల్‌లో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి సిస్టర్ నిర్మల మాట్లాడుతూ... 15 ఏళ్లు నిండిన విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత మెరుగుపడతాయని తెలిపారు.
శ్వాసను నియంత్రించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చన్నారు. ఆచార్య ఘంటా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా చదువుపై ఏకాగ్రత పెంచుకుని తమ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. ప్రసన్నకుమారి మాట్లాడుతూ చదువులో ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.






