09-11-2025 01:46:55 AM
ప్రతిపక్షానికి ఓటేస్తే ఇంటి బయటే నిలబడాలి
కేటీఆర్ బక్వాస్ మాటలు నమ్మవద్దు
ఓపిక పట్టండి, అన్ని హామీలు అమలు చేస్తాం
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): “అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ ఇంటి మనిషిని గెలిపించుకున్నట్టు. మీకు ఏ పని కావాలన్నా, ఇంటి మనిషితో అయితే ఇంట్లోకెళ్లి కూడా పని చేయించుకోవచ్చు. అదే ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే, వాళ్లు పాలోడి లాంటివాళ్లు. పని కోసం ఇంటి బయటే నిలబడి అడగాల్సి ఉంటుంది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది” అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశించి అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ గెలుపు అత్యంత కీలకమని, ఓటర్లు ఈ విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవ ర్గంలో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాబోయే మూడేళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ణు గెలిపించాలని కోరారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులతో పోలిస్తే నవీన్ యాదవ్ వంద రెట్లు ఉత్తమమైన అభ్యర్థి అన్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే, ప్రతిరోజూ సీఎం రేవంత్‌రెడ్డి వెంట తిరిగి నియోజకవర్గ పనులు చేయిస్తారని, అదే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే ధర్నాలు చేయడం తప్ప అభివృద్ధి చేయలేరని అభిప్రాయపడ్డారు. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్లలో రేషన్ షాపుల సమస్యను ప్రస్తావిస్తూ, గత ఎమ్మెల్యే ఆ సమ స్యను పట్టించుకోలేదు, కానీ నవీన్ యాదవ్ ప్రస్తావించిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి రేషన్ షాపులు మంజూరు చేశారని చెప్పారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలను జగ్గారెడ్డి కొట్టిపారేశారు. కేటీఆర్ బక్వాస్ మాటలు ఓటర్లు నమ్మవద్దన్నారు. ఆయన కేసీఆర్ వారసత్వం పొందడం కోసమే మాట్లాడుతున్నారని, ప్రజల అవసరాల కోసం కాదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు నియోజకవర్గ అవసరాల కోసం ఆలోచించి ఓటేయాలని హితవు పలికారు. రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 వంటి హామీలను రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక ప్రకారంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తామని, ప్రజలు ఓపిక పట్టాలని జగ్గారెడ్డి కోరారు.
బెంజ్ స్థాయి ఉన్నా గంజిని మరువను
సంగారెడ్డి, నవంబర్ 8 (విజయక్రాంతి): బెంజ్ స్థాయి ఉన్నా గంజిని మరువను అని, తాను కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తినని, ఎంత ఎదిగినా జీవితం ప్రారంభాన్ని మరిచిపోనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో సరదాగా ముచ్చటించారు.
గంజి తాగి ఎదిగిన వ్యక్తులు బెంజ్ కారులో తిరుగుతూ వారు గడిపిన జీవితాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఇదే సమస్యగా మారిందన్నారు. తాను బెంజ్ కారులో తిరిగే స్థోమత ఉన్నా గంజి తాగే వారితోనే అనుబంధం ఉంటుందని స్పష్టం చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి