09-11-2025 01:44:40 AM
పదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.12 లక్షల కోట్లు
బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో కాంగ్రెస్ ఓటమి భయం కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అందుకే ఫ్రస్టేషన్‌లో బీజేపీపై నిందలు వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపు చ్చుకునేందుకు రాజకీయ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పదేండ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లు, రైల్వే, కొత్తగా ఎయిర్‌పోర్టుకు నిధులను మోదీ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. ట్రిపుల్ ఆర్‌కు రూ.30 వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని, రీజినల్ రింగ్ లైన్ సర్వేకు నిధులను కూడా మంజూరు చేసిందని తెలిపారు.
తెలంగాణకు ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీకు రూ.1400 కోట్లు, బీబీనగర్‌లో ఎయిమ్స్, ట్రైబల్ మ్యూజియం, తార్నాకలో 436 కోట్లతో నేషనల్ సైన్స్ సిటీ సెంటర్, చర్లపల్లి కొత్త టెర్మినల్, వరంగల్ స్మార్ట్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణను చేపట్టిందని వివరించారు. దేశంలో ఎక్కడా లేనంతగా కేవలం జాతీయ రహదారుల కోసమే రూ.1.10 లక్షల కోట్లు నిధులను కేంద్రం ఇచ్చిందని, అందులో రూ.30 వేల కోట్లకు సంబంధించి పైప్‌లైన్ పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే కూడా తెలంగాణకు కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోందని తెలిపారు.
రైల్వేకోసం యూపీఏ హాయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన నిధులు రూ.8,800 కోట్లని, మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు మాత్రమే రూ.7,600 కోట్లు, ఏపీకు రూ.9 వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.750 కోట్లు, చర్లపల్లి టెర్మినల్ నిర్మాణానికి రూ.322 కోట్లు, వీటితోపాటు తెలంగాణలోని 47 రైల్వేస్టేషన్లను ఆధునీకరిరణ పనులు చేపడుతోందని తెలిపారు.
రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో తెలుసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి ఆయన హితవు పలికారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెట్టాపట్టాల్ వేసుకొని అధికారాన్ని పంచుకున్నారని, 20 శాతం ఓట్ల కోసం ఇంకా దిగజారి మాట్లాడితే 80 శాతం ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.