calender_icon.png 9 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీల వసూళ్లకు కళ్లెం!

09-11-2025 01:48:45 AM

ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ

  1. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి..?
  2. మేనేజ్‌మెంట్ కోటాకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు
  3. కాలేజీని బట్టి రూ. 4లక్షల నుంచి 20 లక్షలు 
  4. ప్రతి ఏటా నోటిఫికేషన్ వెలువడకముందే సగంపైగా సీట్లు క్లోజ్

హైదరాబాద్, నవంబర్ 8 (విజయ క్రాంతి): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో వసూళ్ల విధానానికి చెక్ పెట్టేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టబోతోంది. డొనేషన్ల పేరు తో కాలేజీల వసూళ్ల దందాకు బ్రేక్ వేసేలా మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని ఎలాగైనా అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) సీట్లను రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి.

టాప్ కాలేజీలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చే స్తుంటే, ద్వితీయశ్రేణి కాలేజీలు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, తృతీయ శ్రేణి రూ. 4 లక్షల పైనే గుంజుతున్నాయి.  కొన్నేం డ్లుగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయా లనే డిమాండ్ ఉంది. దీనికనుగుణంగా ఈ సీట్లను  ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని అధికారులు భావించారు.

తెలంగాణ ఉన్నత విద్యా మం డలి అధికారులు దీనికి సంబంధించిన ప్రతి పాదనలను సైతం ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచైనా దీనిని పక్కగా అమలు చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి వచ్చే విద్యాసంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఎంబీబీఎస్ తరహాలోనే ఇంజనీరింగ్ సీట్లను కూడా ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు ఓ నివేదికను సైతం ఇప్పటికే అందజేశారు. సీట్ల భర్తీ అంశంపై మరోసారి ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వంతో చర్చించి ముందుకువెళ్లాలనున్నారు. అయితే దీనిని ప్రైవేట్ కాలేజీలు ఒప్పుకుంటాయా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఒకవేళ ఒప్పుకోకుంటే మళ్లీ పాత విధానమే అమలయ్యే అవకాశం ఉంది.

కాలేజీల బంద్ విషయంలో డొనేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇష్టానుసారంగా కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఫీజులు వసూలుచేయకుండా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈ ఏడాది ఫీజులు సైతం ఫైనల్ కావాల్సిఉంది. ప్రస్తుతానికి పాత ఫీజులనే ఈ విద్యాసంవత్సరం వసూలు చేశారు. 

నోటిఫికేషన్ రాకముందే బేరసారాలు

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా (బీకేటగిరీ)లో భర్తీ చేస్తారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాతే మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించాలి. సీట్ల కేటాయింపులో నిబంధనలు తప్పనిసరిగా కాలేజీలు పాటించాల్సి ఉంటుంది. కానీ అవేం పాటించకుండానే నోటిఫికేషన్ వెలువడకముందే బేరసారాలు చేసేస్తున్నారు.

ప్రతి ఏటా బీఢూ సీట్ల భర్తీకు నోటిఫికేషన్ వెలువడకముందే సగంపైగా సీట్లు విక్రయిస్తున్నారు. డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ, దాని అనుబంధ సీట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కొన్ని కాలేజీలు సీట్లను బ్లాక్ చేసి అధిక మొత్తానికి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీటు కావాలనేవారు ముందస్తుగా అడ్వాన్స్‌గా కొంత డబ్బులు చెల్లిస్తే కావాల్సిన సీట్లను బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగతా కోర్సులైనటువంటి ఈసీఈ, ఈఈఈ కోర్సులకూ సీఎస్‌ఈ అంత కాకున్నా రూ.లక్షల్లోనే డొనేషన్లను కొన్ని కాలేజీలు వసూలు చేస్తున్నాయి.

ముట్టజెప్పితే చాలు.. 

సీటుకు అడిగినంత ముట్టజెప్పితే చాలు నిబంధనలన్నీ పక్కకు పోతాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ చేయాలంటే ఇంగ్ల్లిష్, తెలుగు, ఉర్దూ మూడు దినపత్రికల్లో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రతిరోజూ కళాశాలలోని నోటీసు బోర్డు, కాలేజీ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. ఇంటర్మీడియట్‌లో 45 శాతం, రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు 40 శాతం మార్కులొచ్చిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి.

అంతేకాకుండా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) కోటా కింద 15 శాతం, యాజమాన్య కోటా కింద 15 శాతం సీట్లు భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్ల వివరాలను బ్రాంచీల వారీగా ప్రకటించాలి. జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్లు మిగిలితే ఇంటర్‌లో మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి.

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ప్రకారమే సీట్లు భర్తీ చేయాలి. పైగా బ్రాంచ్‌ల వారీగా మెరిట్ జాబితాను నోటిస్ బోర్డులో కాలేజీలు పెట్టాలి. ఇలా భర్తీ చేసిన సీట్లను  తెలంగాణ ఉన్నత విద్యామండలి విధించే గడువులోగా వివరాలు పంపించాలి. కానీ, ఈ ప్రక్రియ ప్రతి ఏటా నామ్‌కేవాస్తేగా జరుగుతుందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.