తమిళనాట విజయ దళపతి
మొదటి సినిమా ఫ్లాప్.. బాడీ షేమింగ్ అవమానాలు
కసితో పరిణతి చెందిన నటుడిగా ఎదిగిన తీరు అద్భుతం
దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు
రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోపే ప్రభంజనం
ఎంజీఆర్ ప్రస్థానాన్ని గుర్తుకుతెస్తున్న విజయ్
రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం
చెన్నై, మే ౪: తమిళ చిత్రసీమలో తిరుగులేని నటుడిగా వెలుగొందిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించారు. అగ్రనటుడిగా వెండితెరను ఏలిన ఆయన ప్రజానాయకుడిగా ప్రజాక్షేత్రంలోనూ తన సత్తా చాటారు. తమిళ వెట్రి కజగం (టీవీకే) అనే రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల మధ్యకు వెళ్లారు.
తద్వారా ఒకప్పుడు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన దిగ్గజ నటుడు, రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ తరహాలోనే విజయ్ కూడా తొలి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన స్థాపించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. విజయ్ సినీ ప్రస్థానం 1984లో బాలనటుడిగా ప్రారంభమైంది. తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయ్ పలు చిత్రాల్లో నటించారు.
18 ఏళ్ల వయసులోనే ‘నాళైయ తీర్పు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆయన నటన అంతంతమాత్రమని, ఫేస్ వాల్యూ లేదని విమర్శలు వచ్చాయి. తీవ్రమైన బాడీషేమింగ్‌ను ఎదుర్కొన్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సమయంలో ఆయన రూపం, నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విమర్శలకు కుంగిపోకుండా ఆయన పట్టుదలతో శ్రమించారు. ‘పూవే ఉనక్కాగా’ సినిమాతో తొలిబ్రేక్ బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రేమకథా చిత్రాలతో యువతకు దగ్గరయ్యారు. ‘గిల్లి’, ‘పోకిరి’ వంటి సినిమాలతో మాస్ హీరోగా స్థిరపడ్డారు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన 69 సినిమాల్లో హీరోగా నటించి ‘దళపతి’గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
అత్యధిక రెమ్యునరేషన్
విజయ్ తన నటప్రస్థానంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన అందుకున్న పారితోషికాల్లో రూ.275 కోట్ల వరకు ఉండొచ్చని సినీ వర్గాల అంచనా. రజనీకాంత్, షారూఖ్‌ఖాన్.. వంటి సూపర్‌స్టార్స్ కూడా ఇప్పటివరకు అంత పారితోషికం తీసుకోలేదనేది టాక్. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ విజయ్‌కి ఆదరణ పెరగడం విశేషం. ఈ క్రమంలోనే అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన కాల్ షీట్ల కోసం పోటీ పడుతున్నాయి. అయినప్పటికీ, ఆయన ప్రజాసేవకే తన ప్రాధాన్యమంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
పార్టీ స్థాపించి సాహసోపేత నిర్ణయం
సినీ శిఖరాగ్రాన ఉన్నప్పుడే విజయ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేని స్థాపించారు. సినిమాలు విడిచిపెట్టి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి వారిని తన రోల్ మోడల్స్‌గా పేర్కొన్నారు. పార్టీ స్థాపించిన తొలిరోజుల్లో ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. కరూర్ కార్నర్ మీటింగ్ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని అనేక మంది చనిపోయారు. ఈ ఘటన ఆయన వ్యక్తిగత ప్రతిష్టను ఇబ్బందుల్లోకి నెట్టింది. దర్యాప్తు సంస్థల విచారణతో విజయ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. రాజకీయ విమర్శలు ఆయన్ను మరింత ఇబ్బంది పెట్టాయి.
తన నిజాయితీని నిరూపించుకునేందుకు సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు తుది దశకు చేరుకుంది. న్యాయస్థానంలో వాదోపవాదాలు దాదాపు ముగిశాయి. దర్యాప్తు అధికారులు అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. సాక్షుల విచారణ ప్రక్రియ కూడా పూర్తయింది. కేసులో త్వరలోనే కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. తీర్పు విజయ్ భవిష్యత్తును నిర్ణయించనుంది. ప్రస్తుతం అందరి దష్టి న్యాయస్థానం వెలువరించబోయే తుది నిర్ణయం పైనే ఉంది. తమిళనాడులో ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు గట్టి పోటీనిస్తూ టీవీకే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. సామాన్య ప్రజల గొంతుకగా మారి తమిళనాడు భవిష్యత్తును మార్చే నాయకుడిగా విజయ్ గుర్తింపు సాధించారు.
వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు
విజయ్ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1999లో ఆయన సంగీతను వివాహం చేసుకున్నారు. నిజానికి ఆమె తన నటకు అభిమాని. అలా వారిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. జేసన్ విదేశాల్లో దర్శకత్వ కోర్సు పూర్తి చేసి సొంతంగా ప్రాజెక్టులు చేపట్టే పనిలో ఉన్నారు. కుమార్తె దివ్య సాషా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. విజయ్, సంగీత దంపతులు 2025 నుంచి విడివిడిగా ఉంటున్నారు. సంగీత తనకు భర్తన నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. రాజకీయంగా విజయ్ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న తరుణంలో నటి త్రిష సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశమైంది.






