నైపుణ్యత పెంపొందించుకోవాలి
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
మంచిర్యాల, మార్చి 9: పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యత పెంపొందించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమ వారం పట్టణంలోని ఐటిఐ ఆవరణలోని ఎటిసి కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, ఐ టి ఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్‌లతో కలిసి ల్యాబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా పూర్తి విద్యలో శిక్షణ అందించి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్, మందమర్రి, జన్నారం ప్రాంతాలలో ఎటిసి కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వృత్తి విద్య కోర్సులు నేర్చుకునే వారు సర్టిఫికెట్ కోసం కాకుండా నైపుణ్యత కోసం 100 శాతం హాజరవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ స్వయంకృషి తో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.




