పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు మెరుగుపరచాలి
జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్
గద్వాల: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పదవ తరగతి-2025 ఫలితాలలో రాష్ట్రంలో 32వ స్థానంలో నుండి 26వ స్థానానికి చేరుకుని 10.36% వృద్ధితో మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన అధికారులు, ఉపాధ్యాయులను అభినందిస్తూ, ఈసారి మరింత నాణ్యమైన విద్య ను అందించేందుకు కృషి చేయాలన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేయనున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధిలో విద్య అత్యంత కీలకమని గుర్తుచేస్తూ, “తెలంగాణ రైజింగ్ 2047” ప్రణాళికలో విద్యార్థులకు నాణ్యమైన జ్ఞానం,నైపుణ్యాలను అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత,బిసి సంక్షేమ అధికారి అక్బర్ పాషా,అన్ని మండలాల విద్యాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీబీ ప్రధానోపాధ్యాయులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు






