10 July, 2026 | 7:56 AM

సంజూకు జరిమానా

09-05-2024 12:05 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్‌కు మరో షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ జరిమానా బారీన పడ్డాడు. తన ఔట్ విషయంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను శాంసన్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది. ‘అంపైర్లతో వాగ్వాదానికి దిగి శాంసన్ ఆర్టికల్ 2.8 ప్రకారం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నిబంధనను ఉల్లఘించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు సంజూ అంగీకరించాడు. తొలి తప్పుగా భావించి అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తున్నాం’ అని తెలిపింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ముఖేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్ నాలుగో బంతికి శాంసన్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్ బౌండ్రీ వద్ద హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి అందుకునే క్రమంలో హోప్ కాలు బౌండ్రీ గీతను తాకినట్లు అనిపించడంతో ఔట్ విషయంలో సందిగ్ధత నెలకొంది. థర్డ్ అంపైర్ పలుమార్లు పరిశీలించిన అనంతరం సంజూను ఔట్‌గా ప్రకటించగా.. శాంసన్ మాత్రం ఔట్ కాదనే ఉద్దేశంతో అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇంతకముందు గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గానూ శాంసన్ మ్యాచ్ ఫీజులో రూ. 12 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.