12 July, 2026 | 5:14 PM

ఎయిర్‌టెల్ చార్జీలూ పెరిగాయ్

29-06-2024 12:12 AM

10-21 శాతం పెంపు

న్యూఢిల్లీ, జూన్ 28: జియో బాటలోనే ఎయిర్‌టెల్ సైతం మొబైల్  చార్జీలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. గురువారం రిలయన్స్ జియో టారీఫ్‌లను పెంపును వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ ప్రిపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ రేట్లను 10 శాతం మేర పెంచుతున్నామని, పెంపుదల జూలై 3 నుంచి అమలులోకి వస్తుందని భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రకటన ప్రకారం 1జీబీ యాడ్‌ఆన్ డేటా టాప్‌అప్ రేటు మూడు రూపాయల పెంపుదలతో రూ.19 నుంచి రూ. 22కు చేరనుండగా, రోజుకు 2జీబీ డేటాను, అన్‌లిమిటెడ్ కాలింగ్ సేవల్ని అందించే 365 రోజుల కాలపరిమితిగల ప్లాన్ రేటు రూ. 600 మేర పెరిగి రూ. 2,999 నుంచి రూ. 3,599కు చేరుతుంది.

అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్ క్యాటగిరీలో 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా ఆఫర్ చేసే రూ.179 ప్లాన్ ధరను రూ. 199కు పెంచింది. ఇదే క్యాటగిరీలోని రూ.455 ధరను రూ. 509కు, రూ.1,799 ధరను రూ. 1,799కు చేర్చింది. డెయిలీ డేటాను అందించే క్యాటగిరీలో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ ప్లాన్ ధర రూ. 479 నుంచి రూ. 579కు పెరుగుతుంది. రోజుకు 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీగల ప్లాన్ చార్జీ రూ.265 నుంచి రూ. 299కు పెరుగుతుంది.

ఇదే వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ ఆఫర్ చేసే ప్లాన్ ధర రూ. 2999 నుంచి రూ.349కు పెరుగుతుంది. 84 రోజుల వ్యాలిడిటీ కోరుకునే చందాదారులు ఇకనుంచి రూ.140 అదనంగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడిటీలో రోజుకు 1.5జీబీ డేటా ప్లాన్ చార్జీ రూ.719 నుంచి రూ. 859కు, రోజుకు 2జీబీ డేటా ఆఫర్ చేసే ప్లాన్ ధర రూ. 839 నుంచి రూ. 979కు పెరుగుతుంది. డేటా టాప్‌అప్ ప్లాన్స్‌లో ఒక రోజు వ్యాలిడిటీగల 1జీబీ ఓచర్ ధర రూ.19 నుంచి రూ. 22కు, 2జీబీ ఇచ్చే ప్లాన్ ధర రూ.29 నుంచి రూ. 33కు పెరుగుతుంది. 65 రోజుల వ్యాలిడిటీతో లభించే 4జీబీ యాడ్‌ఆన్ ప్లాన్ ధరను రూ.65 నుంచి రూ. 77కు పెంచారు. పోస్ట్‌పెయిడ్ చార్జీలను సైతం 10 నుంచి 20 వరకూ ఎయిర్‌టెల్ పెంచింది. 

రోజుకు 70 పైసలలోపే భారం

తాము చార్జీలను చాలా పరిమితంగా పెంచామని, బడ్జెట్ వినియోగదారులకు అనుగుణంగా ఎంట్రీలెవల్ ప్లాన్లలో రోజుకు 70 పైసలలోపే భారం పడుతుందని ఎయిర్‌టెల్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.