నీట్- రద్దు అనాలోచిత నిర్ణయం
- మోదీ సర్కార్ తీరుతో విద్యార్థుల కలలు కల్లలు
- సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): నీట్ పరీక్ష రద్దు మోదీ సర్కార్ అనాలోచిత, నిర్లక్ష్య, నియంతృత్వ నిర్ణయానికి నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ హయాంలో గడిచిన పదేళ్లలో 15 రాష్ట్రాల్లో 93 సార్లు ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, అందులో ఒక్క గుజరాత్‌లోనే 14 సార్లు పేపర్లు లీక్ జరిగిన సందర్భా లు ఉన్నాయన్నారు.
ఈ కారణంగా దేశ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది విద్యార్థు లు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. తాజాగా జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ విషయంలోనూ సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. నీట్ పరీక్ష రద్దు.. పెద్ద నోట్ల రద్దు వంటిదేనన్నారు. నీట్ పేపర్ లీక్‌తో ఏళ్ల తరబడి శ్రమించి చదివిన విద్యార్థుల కలలు కల్లలయ్యాయన్నారు.
ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంతమంది నగలు అమ్మి తమ పిల్లలను నీట్ పరీక్షకు ప్రిపేర్ చేయించారని, వారి ఆశలన్నీ గల్లంతయ్యాయని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ప్రభుత్వ పరీక్షల విధానంలో వ్యవస్థీకృత లోపాలు బహిర్గతమైనట్లు వెల్లడించారు.
2024లో కేవలం ఎనిమిది వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయడం వల్ల దాదాపు 48 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.






