ఇంధన భద్రతపై కొత్త ఆశలు
కింజారపు అమరావతి :
పెట్రోల్ బంకులో పెరిగే ఇంధన ధరల్లో ప్రతి రూపాయి వెనుక ఒక సంక్లిష్టమైన అంతర్జాతీయ కథ దాగి ఉంటుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ము దిరినా ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడతాయి. కానీ, ఆ ప్రభావం చివరకు కనిపించేది మన వంటింటి ఖర్చుల్లోనే. గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడు, డీజిల్ ఖరీదు ఎక్కువైనప్పు డు, రైతు ట్రాక్టర్ నడిపే ఖర్చు పెరిగినప్పు డు సామాన్యుడికి ఒక చేదు నిజం మళ్లీ గుర్తుకొస్తుంది. అదే ఆర్థిక స్వాతంత్య్రం అంటే కేవలం సంపద కాదు, ఇంధన స్వావలంబన కూడా అని.
విదేశీ చమురుపైనే ఆధారం
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం కూడా ఒకటి. కానీ, భారత్ తన ఇంధన అవసరాల కోసం నేటికీ విదేశాలపైనే అధికంగా ఆధారపడుతోంది. దేశానికి అవసరమైన ముడిచమురులో సుమారు 85 శాతం, సహజ వాయువులో దాదాపు సగం దిగుమతులే. ఇందుకోసం ఏటా లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తే ఏ చిన్న సంక్షోభమైనా చివరకు భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. రవాణా వ్యయం పెరిగి కూరగాయల నుంచి సిమెంట్ వరకు ప్రతి వస్తువు ధరపై ప్రభావం పడుతోంది. కనిపించని ప్రపంచ రాజకీయాల భారాన్ని చివరకు మోసేది సాధారణ కుటుంబాలే. డీజిల్ ధర పెరిగిన ప్రతిసారీ ట్రాక్టర్ నడిపే రైతు లెక్కలు మారిపోతాయి.
గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడు మధ్యతరగతి కుటుంబం నెల వారీ ఖర్చుల్లో ఇంకో కోత పెట్టుకోవాల్సి వస్తుంది. ఆటో నడిపే డ్రైవర్, సరుకులు తరలించే లారీ యజమాని, చిన్న హోటల్ నడిపే వ్యాపారి ఎవరి జీవితమూ ఇంధన ధరల ప్రభావానికి దూరంగా ఉండదు. అందుకే ఇంధనం ఇప్పుడు కేవలం ఆర్థిక అంశం కాదు, సామాన్యుడి జీవన ప్రమాణాలకు సంబంధించిన ప్రశ్నగా మారింది.
బొగ్గు నుంచి సింగాస్ వరకు
ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కోల్ గ్యాసిఫికేషన్ లేదా సింగాస్ అనే పదం ప్రధాన చర్చగా మారుతోంది. సాధారణం గా బొగ్గు అనగానే మనకు కాలుష్యం వెదజల్లే థర్మల్ పవర్ స్టేషన్‌లే గుర్తుకొస్తాయి. కానీ, అదే బొగ్గును కొత్త సాంకేతికతతో వేరే రూపంలో వినియోగించే ప్రయత్నం జరుగుతోంది. బొగ్గును నేరుగా కాల్చకుం డా, పరిమిత ఆక్సిజన్‌తో అధిక ఉష్ణోగ్రత వద్ద రసాయనిక ప్రక్రియకు గురిచేస్తే కార్బ న్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వంటి వాయువుల మిశ్రమం ఉత్పత్తి అవుతుంది. దీనినే సింథటిక్ గ్యాస్ లేదా సంక్షిప్తంగా సింగాస్ అంటారు. ఈ వాయువును విద్యుత్ ఉత్పత్తి నుంచి ఎరువుల తయారీ వరకు అనేక పారిశ్రామిక అవసరాలకు వినియోగించవచ్చు.
వ్యూహాత్మక అవసరమా?
ఇది ఒక శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు, భారత్ తనకున్న వనరులతో ఇం ధన భద్రతను ఎలా సాధించాలనే పెద్ద ఆర్థిక, వ్యూహాత్మక ప్రశ్నకు సంబంధించిన ప్రయత్నం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద బొగ్గు నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ సంపదను ప్రధానంగా విద్యుత్ తయారీకే ఉపయోగించాం. కానీ, పెరుగుతున్న ఇంధన అవసరాలు, విదేశీ చమురుపై ఆధారపడటం వల్ల ఏర్పడుతున్న అనిశ్చితి ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తోంది.
ఇప్పటికే చైనా, అమెరి కా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా చైనా తన ఎరువుల పరిశ్రమ లో బొగ్గు గ్యాసిఫికేషన్‌ను కీలక ఆధారం గా మార్చుకుంది. అమెరికా దీన్ని క్లీన్ కోల్ టెక్నాలజీ దిశగా అభివృద్ధి చేస్తోంది. ఈ అనుభవాలను అధ్యయనం చేస్తూ మన దేశం కూడా ఇంధన స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాలని చూస్తోంది.
వేల కోట్ల పెట్టుబడుల వెనుక
ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.37, 500 కోట్ల భారీ ప్రోత్సాహక ప్యాకేజీని ఆమోదించింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రైవేట్ రంగం నుంచి కూడా భారీ స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పరిశ్రమ లకు సంబంధించిన పెట్టుబడి మాత్రమే కాదు.
విదేశీ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ వణికిపోయే భారత ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచాన్ని నిర్మించే ప్రయత్నం. సింగాస్ గురించి విన్నప్పుడు ఇది పారిశ్రామిక రంగానికి మాత్రమే సంబంధించిన అంశంలా అనిపించవచ్చు. కానీ, దీని ప్రభావం చివరకు సామాన్యుడి జీవితంపైనే పడుతుంది. చమురు ధరలు పెరిగినప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుతుంది. ఎరువుల ధర పెరిగితే రైతుపై భారం పడుతుంది.
డీజిల్ ఖరీదు పెరిగితే రవాణా ఖర్చు పెరిగి, ప్రతి వస్తువు ధరపై ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్వదేశీ బొగ్గుతో ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగితే దిగుమతుల ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని కూడా కొంత నియంత్రించవచ్చు.
భారత్ ముందు అసలు సవాలు
అయితే ప్రతి పరిష్కారం వెనుక కొన్ని ప్రమాదాలు కూడా దాగి ఉంటాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో కార్బన్ ఉద్గారా లు విడుదలవుతాయి. ప్లాంట్ల నిర్వహణకు భారీగా నీరు అవసరం అవుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పటికే వేసవులు తీవ్రమవుతున్న సమయంలో ఇవి కొత్త పర్యావరణ సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం ఇప్పటికే ఈ ప్రమాదాలకు పరిష్కారాలు వెతుకుతోంది.
ఉద్గారాలను గాలిలోకి వెళ్లకుండా భూగర్భంలో నిల్వ చేసే ‘కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్’ వంటి సాంకేతికతలు ఆశ చూపుతున్నాయి. ప్లాంట్లలో ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగించే పద్ధతులు కూడా అభివృద్ధి చెందుతున్నా యి. కానీ, సాంకేతికత ఎంత ఆధునికమై నా, అమలులో బాధ్యత లేకపోతే పర్యావరణం మళ్లీ మూల్యం చెల్లించాల్సిందే.
ప్రపంచం పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా కదులుతున్న సమయంలో భార త్ మళ్లీ బొగ్గు గురించి మాట్లాడటం వెన క్కి వెళ్లడమేనని కొందరి వాదన. కానీ, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు పా శ్చాత్య దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. కోట్లాది మందికి చౌకైన, నిరంతర ఇంధనాన్ని అందించాల్సిన అవసరం భారత్‌కు ఉంది. అందువల్ల ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యం సాధించడం ఇప్పుడు అతిపెద్ద సవాలు.
దూరదృష్టితోనే భారత్ భవిష్యత్తు
సింగాస్ అనేది కేవలం ఒక ఇంధనం కాదు, భారత్ ముందున్న వాస్తవిక చిత్రం. ఒకవైపు అభివృద్ధి అవసరం, మరోవైపు పర్యావరణ బాధ్యత. ఒకవైపు ఇంధన స్వావలంబన, మరోవైపు రాబోయే తరాల భవిష్యత్తు. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి ఊపిరిపోసిన బొగ్గు, ఇప్పుడు భార త్‌కు ఆర్థిక భద్రతను ఇస్తుందా లేక కొత్త సంక్షోభాలకు కారణమవుతుందా? అన్న ది మన దూరదృష్టిపైనే ఆధారపడి ఉం టుంది.
ప్రభుత్వం కేటాయిస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, అధునాతన కాలుష్య నియంత్రణ చర్యలు, పారదర్శక అమలు ఇవన్నీ సమన్వయం అయినప్పుడే బొగ్గు సంపద నిజమైన ఇంధన వరంగా మారుతుంది. లేకపోతే ఇదే సంపద మరో పర్యావరణ సంక్షోభానికి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. చివరకు ఈ చర్చలన్నీ తిరిగి చేరేది ఒక సాధారణ భారతీయ కుటుంబం వంటగది ఖర్చుల దగ్గరకే. భారత్ భవిష్యత్తు చివరకు బొగ్గు గనుల్లో కాదు, వాటిని ఎంత బాధ్యతగా ఉపయోగిస్తామన్న దానిలోనే దాగి ఉంది.
వ్యాసకర్త: ప్లస్ ఎన్జీవో గౌరవసభ్యురాలు






