చొరబాట్లకు కంచె!
దేశ భద్రత, ప్రాంతీయ రాజకీయాలపై దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్న భారత్ సరిహద్దు అంశం మరోసారి దేశవ్యా ప్తంగా చర్చనీయాంశమవుతున్నది. బంగాల్‌లో కొత్తగా కొలువైన బీజేపీ సర్కార్ 600 ఎకరాల భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో 4,096 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద భూసరిహద్దుల్లో ఒకటైన భారత్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
సువేందు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కంచె నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అక్రమ వలసలను నిలువరించడమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అక్రమ వలసల పట్ల మానవీయతతో స్పందించాలని అంటూనే, సరిహద్దు సమస్య విషయంలో హసీనాలాగా ఇకపై మెతక వైఖరి అవలంబించబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం గట్టిగా స్పందించడం గమనార్హం. అక్రమ వలసలు, స్మగ్లింగ్, భద్రతా సమస్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ సరిహద్దు ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు ముగిసిన బంగాల్, అసోం రాష్ట్రాల్లో కీలక ప్రచారాంశంగా మారిన విషయం విదితమే.
కాగా, భారత్ విడిపోయినప్పుడు మొదలైన ఈ అక్రమ వలసల సమస్య 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం తర్వాత తీవ్రరూపం దాల్చింది. యుద్ధం, పేదరికం, ఉపాధిలేమి, సైనిక తిరుగుబాట్లు వంటి కారణాలతో భారత్‌లోకి వలసలు పోటెత్తాయి. భాషా, సంస్కృతి ఒకే రకంగా ఉండటంతో చొరబాటుదారులను గుర్తించడమూ కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే అక్రమ వలసలను నిలువరిం చేందుకు 1980లలో ప్రారంభమైన కంచె నిర్మాణం దాదాపుగా 80 శాతం పూర్తయినట్టు తెలుస్తున్నది. భూసేకరణ, భౌగోళిక ఇబ్బందుల కారణంగా మిగిలిన 20 శాతంలో ఎక్కువ భాగం బంగాల్‌లోనే ఉండటాన్ని బీజేపీ మొదటినుంచీ ప్రస్తావిస్తున్నది.
అక్రమ వలసదారులు ఎంతమంది ఉండొచ్చనే సంఖ్యపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, భారత్ తిరిగి పంపిస్తున్న వారిని బంగ్లాదేశ్ తమ పౌరులుగా అంగీకరించడంలో ఆలస్యం జరుగుతున్నది. దీంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతున్నది. మరోవైపు పాక్, బంగ్లా, ఆఫ్ఘనిస్థాన్‌లో మతపరమైన హింసకు గురై భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడమేమిటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో శరణార్థులు, అక్రమ వలసదారుల మధ్య ఉండే సన్నని గీత చెరిగిపోకుండా కేంద్రం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.






