13 May, 2026 | 10:12 AM

నీట్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

21-06-2024 02:04 AM

సీపీఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి)/ఇబ్రహీంపట్నం:  నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. స్కోర్‌కార్డులు రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామనడం సమస్యను పక్కదారి పట్టించడమేనని విమర్శించారు. ఒకే దేశం, ఒకే పరీక్ష పేరిట  బీజేపీ  పేపర్ లీకేజీకి పాల్పడిందని ఆరోపించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, దాసరి పాండు, మాయ క్రిష్ణ, దయ్యాల నర్సింహ, గడ్డంవెంకటేష్, ఎదునూరి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయ విచారణ జరిపించాలి 

నీట్ పేపర్ లీకేజీపై సిపిఎం హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ధర్నా చేపట్టారు. పేపర్ లీకేజీపై న్యాయ విచారణ జరపాలని, ప్రధాని మోడీ మౌనాన్ని వీడి ప్రజలకు జవాబు చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు, నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కే నాగలక్ష్మి, ఎం దశరథ్ పాల్గొన్నారు.

నీట్‌ను రద్దు చేయాలి

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలో సీపీఎం ఆధ్యర్యంలో ధర్నా నిర్వహించారు.   కేంద్రం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బీ సామెల్ మాట్లాడుతూ.. సుప్రీం  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేశారు.