24 May, 2026 | 3:07 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌

24-05-2026 02:02 PM

న్యూఢిల్లీ:  ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో భారతదేశం ఒకటిగా అభివర్ణిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఆదివారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో జరిపిన చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల గాఢత పెరుగుతోందని చెప్పారు. భద్రత, వాణిజ్యం, ఇంధనం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల రంగాలలో సహకారాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ...  రక్షణ, భద్రతా సహకారం విషయానికి వస్తే 10 సంవత్సరాల ప్రధాన రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ఇటీవల పునరుద్ధరించబడిందని, సమగ్రమైన నీటి అడుగున డొమైన్ అవగాహన రోడ్‌మ్యాప్‌పై కూడా సంతకం చేయబడిందన్నారు. రక్షణ రంగంలో ముందుకు సాగుతున్నప్పుడు మేక్ ఇన్ ఇండియా విధానాన్ని, ఇటీవలి సంఘర్షణల నుండి నేర్చుకున్న పాఠాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రాముఖ్యత గురించి మేము చర్చించాం. ఆర్థిక పరంగా, పరస్పర, ఉభయ ప్రయోజనకర వాణిజ్యానికి సంబంధించిన మధ్యంతర ఒప్పందం తుది ముసాయిదాను త్వరగా ఖరారు చేయడం గురించి చర్చించుకున్నామని తెలిపారు. ఫిబ్రవరి 2025లో ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా సంకల్పించిన సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగు కానుందని కొనియాడారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల తమ బృందం వాషింగ్టన్‌లో పర్యటించిందని, అదే ఉద్దేశ్యంతో త్వరలో అమెరికన్ బృందం భారతదేశాన్ని సందర్శిస్తుందని, అలాగే ఇంధన సమస్యలపై కొంత సమయం చర్చించినట్లు వెల్లడించారు. 140 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చడమే బీజేపీ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అన్నారు. వారికి ఇంధనం అందుబాటులో సరసమైన ధరలకు లభించేలా చూడటమే మా ప్రధాన లక్ష్యం. అందువల్ల, ఇటీవలి నెలల్లో ఇంధన వాణిజ్యం విస్తరించడాన్ని అమెరికన్ బృందం స్వాగతిస్తున్నామని, భారతదేశ ఇంధన భద్రతకు వైవిధ్యభరితమైన సరఫరాలే కీలకమని వ్యాఖ్యానించారు.

అణు శక్తి సహకారానికి కూడా కొంత సమయాన్ని కేటాయించామని, శాంతి చట్టం ఆమోదం పొందడం ద్వారా కొత్త అవకాశాలు ఆవిష్కృతమయ్యాయి. ఇటీవల అమెరికన్ ప్రతినిధి బృందం భారతదేశాన్ని సందర్శించిందని, అణు రంగంలో సహకారానికి ఉన్న అపారమైన అవకాశాలను సాకారం చేసుకోగలమని మేము ఆశిస్తున్నామన్నారు. అమెరికా నుంచి భారత్ కు ఎదురవుతున్న కొన్ని నియంత్రణ సంబంధిత అంశాలను కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినట్లు జైశంకర్ తెలిపారు.