మనసు దోచిన పాట్నా పెద్దాయన
పాట్నా, జూన్ 29: మనదేశంలో పర్యటనకు వచ్చే విదేశీయులను పర్యాటక ప్రదేశాల్లో కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్న సంఘటనలు అనేకం చూశాం. కానీ, బీహార్ రాజధాని పాట్నాలో ఓ పెద్దాయన విదేశీ పర్యాటకులకు అందించిన సహకారం ఇప్పుడు నెట్టింట అందరి మనసులు దోచుకొంటున్నది. విషయం ఏమిటంటే బ్రిటిష్ వ్లోగర్స్ (ప్రపంచం మొత్తం తిరుగుతూ అక్కడి అనుభవాలను సోషల్‌మీడియాలో పంచుకొనేవారు) రెనీ, బెన్ ఇటీవల పాట్నాకు వచ్చారు. వాళ్లు వెళ్లాల్సిన ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ఓ ఆటోవాలాను కేకేశారు. వారి వాలకం చూడగానే విదేశీయులని గుర్తించి ఆ ఆటోవాలా.. అసలు రేటుకంటే ఐదారు రెట్లు ఎక్కువ చెప్పాడట కిరాయి. దీంతో వాళ్లు దిక్కులు చూస్తుండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఓ పెద్దాయని రంగంలోకి దూకేశారు. ఆటోవాలాను చెడామడా తిట్టేసి రూ.100 కే ఆటో మాట్లాడేశాడు. నువ్వు కాదంటే చెప్పు వేరే ఆటోలో పర్యాటకులను పంపిస్తా అని గయ్‌మనటంతో ఆటోవాలా రూ.100కే తీసుకెళ్తానని ఒప్పుకొన్నాడు.






