‘నేనెక్కడున్నా’ ట్రైలర్ విడుదల
ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్‌టెల్ ఫేం సశా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలన్నారు. మిమో చక్రవర్తి, ఝాన్సీగా సశా చెత్రిలు జర్నలిస్ట్ పాత్రలు పోషించారు. జీతం కోసం కాకుండా జనాల జీవితాల కోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్నఆనంద్, ఝాన్సీ చేసిన కొన్ని స్ట్రింగ్‌ఆపరేషన్స్ వల్ల అవినీతిపరుల భాగోతాలు బయట పడతాయి. ఆ తర్వాత ఏమైంది? ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, పోసాని కష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.






