నేరేళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి
- 2017లో ఇసుక లారీలకు వ్యతిరేకంగా ఆందోళన
- గ్రామస్థులతో పాటు అరెస్టయిన గోపాల్
- అనారోగ్యంతో బాధపడుతూ మృతి
- రూ.లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్
- కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రాజన్న సిరిసిల్ల/తంగళ్లపల్లి, జూలై 12 (విజయక్రాంతి): 2017లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల ఘటన బాధితుల్లో ఒకరైన యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు గంధం గోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందారు. 2017 జూలై 2న నేరేళ్ల గ్రామంలో ఇసుక లారీ ఢీకొని ఓ స్థానికుడు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే ప్రాంతంలో వరుసగా ఇసుక లారీల కారణంగా జరిగిన నాలుగో మరణం కావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు కొన్ని ఇసుక లారీలను అడ్డుకుని, నిప్పంటించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు పలువురు గ్రామస్థుల ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, విద్యుత్ షాకులు ఇచ్చారని, ప్రైవేట్ భాగాల్లో వేడి నీళ్లు పోశారని, కుల దూషణలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
జాతీయ స్థాయిలో సంచలనం
నేరేళ్ల ఘటనపై గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ), జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించి విచారణ చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కొందరు యువకులకు గాయాలయ్యాయని, కొంత మంది పోలీసు అధికారులు హద్దులు మీరా రని హైకోర్టుకు తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ఓ సబ్ -ఇన్‌స్పెక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నేరేళ్ల ఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. విపక్ష పార్టీలు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాయి. అప్పటి జిల్లా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవా లని గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పిం చాయి. దళితులపై పోలీసుల అమానుష వైఖరికి ఇది నిదర్శనమని పలువురు ప్రజా సంఘాలు ఆరోపించాయి.
గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్
గంధం గోపాల్ మృతి పట్ల మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపాల్ మృతి బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కేటీఆర్ తరఫున అందించి నట్లు బీఆర్‌ఎస్ నాయకులు మాట్ల మధు, మీసాల కృష్ణ తెలిపారు. గోపాల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిగ్భ్రాంతి
గోపాల్ మృతి పట్ల తెలంగాణ రాజ్యాధి కార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గంధం గోపాల్ అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవే క్షించాలని సిరిసిల్ల జిల్లా పార్టీ నాయకులకు సూచించారు.






