మూసీ బాధితులను ఆదుకోవాలి
- ఆ తర్వాతే మూసీ అభివృద్ధి జరగాలి
- ఎంపీ ఈటల రాజేందర్
- టీఆర్‌ఎల్డీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని హోటల్ సెంట్రల్ కోర్ట్, లక్షీకాపూల్‌లో శనివారం మూసీ ప్రాజెక్టు, దానికి సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎల్డీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మూసీ బాధితులు ఉన్నారని, వారి ఆక్రందనలు, సమస్యలకు సరైన పరిష్కారం చూపించిన తరువాతనే ప్రభుత్వం మూసీ అభివృద్ధిపై గానీ, హైడ్రాపై గానీ ముందుకు సాగాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించని ఏ అభివృద్ధి అయినా వ్యర్థమేనని అన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడం, మరిన్ని ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి మూసీని శుద్ధి చేయడం, డ్రైనేజీ ఇన్ ను అడ్డుకోవడం, క్యాచ్మెంట్ ఏరియాను పునరుద్ధరించడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని సూచించారు. ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ మాట్లాడుతూ.. లక్ష యాభై వేల కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టును, జీతాలు, పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు అసలు పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదని, ఇక నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసించగలమని అన్నారు.
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి ఊరిలో మైసమ్మలు మిగిలి, కట్టలు, చెరువులు మాయమైపోయాయని, ఒకప్పుడు వరదలతో ప్రవహించిన మూసీ నది నేడు మురికికూపంగా మారిందని అన్నారు. తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోషియల్ ట్రీట్మెంట్ ప్లాంట్లు విరివిగా నెలకొల్పాలని, పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదలకూడదని అభిప్రాయపడ్డారు.
మన్నారం నాగరాజు మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్‌లోని మలక్‌పేట్ రేసర్స్‌కు చెందిన 103 ఎకరాలను మూసీ నిర్వాసితులకు కేటాయించి, అక్కడ వెర్టికల్ స్ట్రక్చర్లు నిర్మించి అందరికీ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్ణాల శ్రీరాములు మాట్లాడుతూ.. అందరూ మూసీ పునర్జీవ ప్రాజెక్టును స్వాగతిస్తున్నప్పటికీ, డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై చర్చించడం కష్టమని అన్నారు.
ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఆశ్రయం కల్పించకుండా, సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఈ ప్రాజెక్టును గ్రౌండ్ చేయవద్దని అన్నారు. కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రిగారికి నివేదిస్తామని చెప్పారు. కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. నిర్వాసితుల పునరావాసం, సరైన నష్టపరిహారం, వివిధ ప్రజా సంఘాలు లేవనెత్తిన సందేహాల నివృత్తి అనంతరమే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీ, హైడ్రా, మూసీ పునరుద్ధరణ అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి ముఖ్యమంత్రిగారిని నివేదికలతో కలిసి కలుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి (ఉపాధ్యక్షులు, టీఆర్‌ఎల్డీ), బీరప్ప (ప్రవక్త), విశాల్ (ప్రధాన కార్యదర్శి), ఓంకార్ (కార్యదర్శి), నరసింహారావు (ప్రధాన కార్యదర్శి), రిషభ్ జైన్ (ప్రధాన కార్యదర్శి), గిరి కుందే (కోశాధికారి), బుల్లెట్ వెంకన్న, రాజ్ కుమార్ (రాష్ట్ర యువజన అధ్యక్షులు), కోటేశ్వర్, శ్రీనివాస్, విక్రమ్, బేగ్, కిరణ్, మల్లేష్ గౌడ్, మాడు సత్యం గౌడ్, శ్రీ కర్నాటి మనోహర్, రాంప్రసాద్ (వరంగల్ జిల్లా అధ్యక్షులు), జనగాం జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ సామాజికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.






