12 July, 2026 | 1:11 AM

20 రోజులు.. 1,570 ట్రిప్పులు!

12-07-2026 12:00 AM
  1.  నగరంలో ముమ్మరంగా నాలా పూడికతీత
  2. వేగవంతంగా హైడ్రా మాన్సూన్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ పనులు
  3.  నాలాల్లో చెత్త వేయొద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

సికింద్రాబాద్, జూలై 11 (విజయక్రాంతి): కాలువల్లో చెత్త వేయవద్దు అన్ని నగర ప్రజలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. నగరంలో నాలాలు ఊపిరి పీల్చు కుంటున్నాయి.జూన్ 22వ తేదీ నుంచి పెద్దయెత్తున పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. నిరంతరంగా పనులు కొనసాగించడంతో నాలాల్లో ట్రక్కుల కొద్దీ పూడిక బయట పడుతోంది. హైడ్రా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్తో పాటు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్లు రంగంలోకి దిగి పూడికను తొలగిస్తున్నాయి.

పేరుకుపోయి పూడికతో మురుగు కంపు కొట్టిన నాలాలు ఇప్పుడు వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా మారుతున్నాయి. నగర వ్యాప్తంగా హైడ్రా పెద్దయెత్తున పూడిక తీసే పనులు ప్రారంభించి కొనసాగిస్తోంది. ఇలా జూన్ 22 వ తేదీ నుంచి జులై 11 వ తేదీ వరకూ మొత్తం 1570 ట్రక్కుల పూడికను హైడ్రా తొలగించింది. మ్యాన్హోల్స్, కల్వర్టులవద్ద పేరుకుపోయిన పూడికతో పాటు ప్రవాహానికి అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో నాలాల్లో పూడికను కూడా హైడ్రా తొలగిస్తోంది.

నగరవ్యాప్తంగా అనేక కాలనీల్లో నాలాల్లో పూడిక తీయడంతో మురుగు నీరు కూడా సాఫీగా సాగుతోంది. దీంతో మురుగు పోటెత్తే పరిస్థితులు కూడా నగరంలో చాలావరకు తగ్గాయని నగర ప్రజలు చెబుతున్నారు. ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ వరద, మురుగు కాలువల్లోకి వెళ్తున్నాయి. దీంతో వరద ప్రవాహానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వర్షం పడినప్పుడు వరద కాలువల్లో వరద సాఫీగా సాగక కాలనీలను, రహదారులను ముంచెత్తుతున్నాయి.

నాలాల్లో చెత్త వేయవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర వ్యాప్తంగా ఎక్కడ చెత్త తీసినా టన్నుల కొద్దీ చెత్త బయట పడుతోంది. ప్రజలు ఈ విషయంలో దృష్టి సారించి చెత్తను కాలువల్లో వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ,ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలను వినియోగించుకోవాలని సూచించారు. లేని పక్షంలో చెత్త కుండీల్లో చెత్తను వెయ్యాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.