10 May, 2026 | 1:22 AM

రెనోవాలో న్యూరో సన్సైస్ శిక్షణ

10-05-2026 12:28 AM

న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాల్లో వస్తున్న ఆధునిక మార్పులు, అత్యాధునిక చికిత్సా విధానాలపై యువ వైద్యులకు అవగాహన కల్పించేందుకు శనివారం ముషీరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల అలుమ్ని ఆడిటోరియంలో ‘మాస్టర్ క్లాస్ ఇన్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 

రెనోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్ (రిన్స్) న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు, గాంధీ ఆసుపత్రి న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు, పాన్ రీసెర్చ్ ఫౌండేషన్, తెలంగాణ న్యూరోసైన్సెస్ సొసైటీ (టీఎన్‌ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ రెండు రోజు ల శిక్షణా సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 80 మందికి పైగా పీజీ వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు హాజరయ్యారు. తెలంగాణ న్యూరోసైన్సెస్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ డా. ధైర్యవాన్, సెక్రటరీ డా. ఎన్. ప్రతా ప్ కుమార్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డా. డి. రాజా రెడ్డి, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఓఓ రవీంద్రనాథ్ గరగ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

సదస్సు నిర్వహణ అధ్యక్షుడు డాక్టర్ జెఎంకె మూర్తి, నిర్వహణ కార్యదర్శులు డాక్టర్ టివిఆర్‌కె మూర్తి, డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా పస్పాల మాట్లాడుతూ.. న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాల్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘మాస్టర్ క్లాస్’ ద్వారా వారి క్లినికల్ నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. రోగుల నిర్ధారణకు సంబంధించిన ప్రాథమిక పరీక్షా విధానాలు, క్లినికల్ కేస్ డిస్కషన్స్, మాక్ ఎగ్జామినేషన్ సెషన్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

గాంధీ ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె. శ్రీనివాస్, ప్రొఫెసర్ కె. రవి మరియు న్యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. రమేష్ కీలక పాత్ర పోషించడమే కాకుండా, విద్యార్థులకు తమ అమూల్యమైన సూచనలు అందించారు. హైదరాబాద్‌తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థలకు చెందిన సీనియర్ అధ్యాపకులు ఈ సెషన్లలో బోధకులుగా వ్యవహరించారు. బోధనాత్మక ఉపన్యాసాలు, ప్రాక్టికల్ ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో సంయుక్త నిర్వహణ కార్యదర్శులు డా. మురళీధర్ రెడ్డి, డా. లలిత పి, పలువురు సీనియర్ న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు పాల్గొన్నారు.