16-02-2026 12:15:57 AM
చైర్మన్ పదవి ఓ పార్టీకి.. వైస్ చైర్మన్ పదవి మరో పార్టీకి
బీఆర్‌ఎస్‌కు మెజార్టీ దక్కినా తప్పని భంగపాటు!
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి ఎంట్రీతో మారిన సీన్
అనైతిక పొత్తులపై గులాబీ విమర్శలు..
‘తుక్కుగూడ’ ఉదంతాన్ని గుర్తుచేస్తూ అధికార పార్టీ కౌంటర్
ఆమనగల్లు, ఫిబ్రవరి 15:(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో కొత్త పొత్తు పొడిచింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే విషయం మరోసారి నిరూపితమైంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కత్తులు దూసుకునే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. ఆమనగల్లు మున్సిపాలిటీ వేదికగా అనూహ్యంగా చేతులు కలిపాయి.
చేయి విడవని కమలం అన్నట్లుగా సాగుతున్న ఈ కొత్త సమీకరణం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కుర్చీ కోసం కుదిరిన లెక్క. ఇటీవలి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాలకు బీఆర్‌ఎస్ 8, బీజేపీ 6 కౌన్సిలర్ కాంగ్రెస్ ఒక్క స్థానం గెలుచుకుంది. అయితే బీఆర్‌ఎస్ మేజిక్ ఫిగర్కు టెక్నికల్ గా ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
సరిగ్గా ఇదే సమయంలో ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ గా మారింది. మెజారిటీ కోసం బీజేపీ వేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇరు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈ అసాధారణ పొత్తులో భాగంగా పదవుల పంపకం కూడా పూర్తయినట్లు సమాచారం. మున్సిపల్ చైర్ పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి కోగూరి అనితా శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి , మోక్తల వెంకటయ్య పేర్లు తెరపైకి వచ్చాయి.
ఎంపీ, ఎమ్మెల్యే ఎంట్రీ!
నాగర్ కర్నూల్ ఎంపీమల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంట్రీతో సీన్ మారింది. కేవలం కౌన్సిలర్ల బలమే కాకుండా రాజకీయ ఉద్ధండులైన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తమ ఎక్స్ అఫీషియో ఓట్లను ఆమనగల్లు మున్సిపాలిటీలోనే నమోదు చేసుకోవడం విశేషం.
వీరిద్దరి ఓట్లు తోడవడంతో కూటమికి తిరుగులేకుండా పోయింది.ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్ ను పీఠానికి దూరం పెట్టడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఏకమ య్యాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. పట్టణంలో ఈ వింత పొత్తుపై జోరుగా చర్చ సాగుతోంది. ఢిల్లీలో కొట్లాట.. ఆమనగల్లులో దోస్తీ చూస్తుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అర్థమవుతోంది.
అధికారం కోసం ఎత్తులు
ఆమనగల్లు మున్సిపాలిటీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం నియోజక వర్గంలో కొత్త చర్చకు దారితీసింది. ఈ పొత్తుపైన బీఆర్‌ఎస్ శ్రేణులు మగ్గుమంటుండగా, బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు వారికి దీటుగా సమాధానం ఇస్తున్నారు. గతంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ ఎలా తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చైర్మన్ పీఠం దక్కించుకున్నారో బీఆర్‌ఎస్ నాయకులు గుర్తుచేసుకోవాలని చురకలు అంటిస్తు న్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు.