కొత్త సీఎస్ సంజయ్ జాజు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- సీఎం సలహాదారుగా రామకృష్ణారావు
- సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకం
- 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్, జూన్ 26 (విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజు నియమిస్తూ శుక్రవారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. కాగా, రాష్ట్ర పరిపాల నపై ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, కమ్యూనికే షన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. అయితే, 2014 అక్టోబర్‌లో డిప్యూటేషన్‌పైన కేంద్ర సర్వీసుకు వెళ్లిన సంజయ్ జాజు.. 2018 మార్చి వరకు ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ డైరెక్టర్‌గా, కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న సంజయ్ జాజును తెలంగాణకు పంపు తూ నిర్ణయం తీసుకొంది.
కొత్త సీఎస్ పోస్టుకు సంజ య్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్ పేరును కూడా సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. చివరికి సంజయ్ వైపే ఆయన మొగ్గు చూపారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్ కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పనిచేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. సంజయ్ 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.
ఐఏఎస్‌లకు స్థానచలనం
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పు లు చేర్పులు చేపట్టింది.అందులో భాగంగానే పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణ యం తీసుకుంటూ ఒకేసారి 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ తాజా బదిలీలలో భా గంగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ నియమితులయ్యారు.
ఇప్పటివరకు సీఎంఓలో సేవలందించిన అజిత్‌రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొత్త బాధ్యతలు అప్పగించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమితులయ్యారు. అదే విధంగా పలువురు సీనియర్ అధికారులకు అ దనపు బాధ్యతలను కూడా కేటాయించింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులు కాగా.. ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామ య్యర్ నియామకం కాగా.. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అదనంగా నిర్వహించనున్నారు. చేనేత, హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్‌కు ఆ శాఖలోనే మరికొన్ని అదనపు బాధ్యతలను కేటాయించారు. అదే శాఖకు జాయిం ట్ సెక్రటరీగా కాత్యాయనీదేవిని నియమించారు.
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండీఏ జా యింట్ కమిషనర్‌గా కే.చంద్రకళను, తెలంగాణ రె డ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీని నియమించారు. ఆర్ అండ్ బీస్పెషల్ సెక్రటరీగా గంగాధర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరే షన్(జీడబ్ల్యూఎంసీ) కొత్త కమిషనర్‌గా టీ.వెంకన్న, టూరిజం డైరెక్టర్‌గా కేవీ విద్యాసాగర్‌ను నియమించారు.
రామకృష్ణారావుకు కీలక బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప దవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికా రి కే.రామకృష్ణారావును సీఎం రేవంత్‌రెడ్డికి సలహాదారుడిగా, ఎక్స్- ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.912 జారీ చేసింది. పరిపాలనలో ఆయనకు న్న సుదీర్ఘ అనుభవాన్ని వినియోగించుకునేందుకు రిటైర్మెంట్ రోజు ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అ ప్పగించనుంది. ఈ నియామకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విడిగా జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సంజయ్ జాజు.. 1992 బ్యాచ్ ఐఏఎస్
సంజయ్ జాఉ స్వస్థలం మధ్యప్రదేశ్. ఎంటెక్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ, ఎంబీఏ (ఫైనాన్స్) చదివారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, కేంద్ర రక్షణ ఉత్పత్తుల శాఖలో అదనపు కార్యదర్శిగా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.






