10 July, 2026 | 5:13 AM

కొత్త నేర చట్టాలు

01-07-2024 12:52 AM
  1. నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలు
  2. వలస చట్టాలను రద్దు చేస్తూ కొత్త ప్రొసీజర్లు
  3. గతేడాది డిసెంబర్‌లో ఆమోదించిన పార్లమెంట్
  4. ఐపీసీ కన్నా కఠిన శిక్షలు, భారీ జరిమానాలు

న్యూఢిల్లీ, జూన్ 30: బ్రిటీష్ వలస పాలనలో తీసుకొచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలు నేటి (జూలై 1) నుంచి అమల్లోకి రానున్నాయి. 163 ఏళ్ల కింద తీసుకొచ్చిన ఐపీసీ స్థానంలో భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) అమల్లోకి వస్తుంది. దీనితో పాటు 126 ఏళ్ల కింద తీసుకొచ్చిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు బదులుగా భారతీయ నాగరిక సురక్షా సంహిత, 151 ఏళ్ల కింద వచ్చిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

కొత్త చట్టాలు ఆధునిక న్యాయ వ్యవస్థను తీసుకురానున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు, ఎస్‌ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు పంపండం, క్రూరమైన నేరాలు జరిగినప్పుడు క్రైమ్ సీన్లలో వీడియోగ్రఫీ వంటి నిబంధనలకు ఈ చట్టాలు అవకాశమిస్తున్నాయి. అంతేకాకుండా గతంతో పోలిస్తే కొన్ని నేరాలకు సంబంధించి శిక్షలను మరింత కఠినతరం చేశారు. అత్యాచారం, పిల్లల అపహరణ వంటి నేరాల్లో కనీసంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా నిబంధనలను పొందుపరిచారు.

ప్రతిపక్షాలు నిరసిస్తున్నా..

గతేడాది ఆగస్టులో ఈ మూడు చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై స్టాండింగ్ కమిటీని నియమించగా బిల్లులకు సభ్యులు అనేక సూచనలు చేశారు. అయితే వాటిని మోదీ ప్రభుత్వం పరిగణించకుండా గతేడాది డిసెంబర్ 21న బిల్లులను ఆమోదించారు. 2023 డిసెంబర్ 25న రాష్ట్రపతి సంతకం చేయగా.. అదే రోజు ఈ మూడు చట్టాల అమలుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2024 జూలై 1 నుంచి అమలు చేస్తామని తేదీని ప్రకటించారు. కానీ, విపక్షాలు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలను ఆమోదించే సమయంలో తాము గైర్హాజరు అయ్యామని, ఇందులో అత్యంత కఠిన నిబంధనలు ఉన్నాయని పేర్కొంటూ అమలును వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. కానీ, వీటి అమలుకు కేంద్రం దృఢ నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టాలపై పోలీసులు, జైళ్లు, ప్రాసిక్యూటర్లు, న్యాయ, ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. 

కొత్త నిబంధనలు

ఈ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోలీసులు, న్యాయవ్యవస్థలకు శిక్షణ నిర్వహించినా వీటిని సజావుగా అమలు చేయడంపై భయాలు నెలకొన్నాయి. కొన్ని పాత చట్టాలను అలాగే కొనసాగించినా చాలా వరకు ఎన్నో మార్పులను చేశారు. ఐపీసీలోని సెక్షన్లను కుదించారు. అయితే, ట్రక్ డ్రైవర్ల నిరసన కారణంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన సవరించిన నిబంధనల అమలు చేయడం లేదు. ఈ కొత్త చట్టాలు చిన్న చిన్న కేసుల్లో సామాజిక సేవను శిక్షగా విధిస్తుంది. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను సాక్ష్యాలుగా అంగీకరిస్తాయి. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ఈ చట్టాలు కచ్చితమైన నిర్వచనం ఇచ్చాయి.

రాజద్రోహమనే పేరును నేరంగా రద్దు చేసి రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు అనే పేరుతో కొత్త సెక్షన్‌ను ప్రవేశపెట్టాయి. ఈ సెక్షన్ గతం కంటే మరింత కఠినంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత.. వేర్పాటు వాద చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక, దేశద్రోహ కార్యకలాపాలతో పాటు దేశ సార్వభౌమత్వం, ఐక్యతను దెబ్బతీసే చర్యలను నేరంగా పరిగణిస్తూ సెక్షన్లను చేర్చింది. న్యాయ విచారణకు సంబంధించిన అంశాల్లోనూ అనేక సంస్కరణలను తీసుకొచ్చిఇంది. దర్యాప్తు పూర్తయిన కేసులను 45 రోజుల్లోగా తీర్పులు ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. మొదటి విచారణ ప్రారంభమైన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మహిళలు, పిల్లలు, రాజ్య వ్యతిరేక నేరాలకు కొత్త చట్టాలలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.  

ఢిల్లీ పోలీసుల యాప్..

జూలై 1 నుంచి అన్ని ఎఫ్‌ఐఆర్‌లు సీఆర్‌పీసీలోని 154 సెక్షన్‌కు బదులుగా బీఎన్‌ఎస్‌లోని 173 సెక్షన్ కింద నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లోనూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త చట్టాలకు అనుగుణంగా ఢిల్లీ పోలీసులు ఈప్రమాణ్ అనే అప్లికేషన్‌ను తీసుకొచ్చారు. నేరాలకు సంబంధించిన విచారణ, స్వాధీనానికి సంబంధించిన వీడియో, ఆడియోలను రికార్డు చేయడంలో అధికారులకు సాయం చేసేందుకు దీన్ని ప్రారంభించారు. ఈ చట్టాలతో భారత పౌరుడు దేశం లోపల లేదా వెలుపల చేసిన ఏదైనా నేరానికి ఈ చట్టాలు వర్తిస్తాయి. అంతేకాకుండా జరిమానాలను నేరాన్ని బట్టి పెంచే అధికారాన్ని మేజిస్ట్రేట్లకు కల్పిస్తున్నాయి. 

అవగాహన కోసం కార్యక్రమాలు

కొత్త చట్టాల్లో అనేక సెక్షన్లలో మార్పులు రావడంతో వీటిని అలవాటు చేసుకోవడానికి పోలీసులు, న్యాయ సిబ్బంది, ప్రజలకు చాలా సమయం పడుతుంది. దీంతో కేంద్ర హోం శాఖ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందుకోసం సాంకేతిక అప్‌గ్రేడేషన్, కెపాసిటీ బిల్డింగ్, సమాచార మాధ్యమాల ద్వారా ప్రచారం, సమీక్షా సమావేశాలు, పాఠ్యాంశాలు లేదా శిక్షణ కార్యక్రమాల్లో వీటిని చేర్చడం వంటి చర్యలు తీసుకుంది. ఇందుకోసం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, కర్మయోగి భారత్‌లో వివిధ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటికే లక్షలాది మంది అధికారులు వీటిల్లో నమోదు చేసుకున్నారు.

సుమారు 1.5 లక్షల మంది అధికారులు ఈ కోర్సులను పూర్తి చేశారు. అంతేకాకుండా కర్మయోగిలో భాగంగా ఐఏఎస్ శిక్షణలో భాగంగా ఈ కోర్సులను చేర్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆకాశవాణి, దూరదర్శన్, MyGov వెబ్‌సైట్‌లో కొత్త చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ మూడు కొత్త చట్టాలను యూనివర్సిటీ, న్యాయ విద్యా కేంద్రాల పాఠ్యాంశాల్లో చేర్చడం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వివిధ మంత్రిత్య శాఖల సమన్వయంతో ఇప్పటివరకూ తొమ్మిది సమీక్షా సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో కొత్త క్రిమినల్ చట్టాల్లోని నిబంధనలపై అవగాహన కోసం గ్రూప్ డిస్కషన్లు, వర్క్‌షాపులు, సెమినార్లు, క్విజ్‌లతో ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కొత్త నేర చట్టాలు

కఠిన చట్టాల్లో కొన్ని.. 

  1. * సెక్షన్ 65: బీఎన్‌ఎస్‌లోని ఈ సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తి 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే అతనికి కనీసం 20 ఏళ్ల జైలు విధించవచ్చు. దీన్ని యావజ్జీవ కారాగారానికీ పొడిగించవచ్చు. 
  2. * సెక్షన్ 66: అత్యాచార సమయంలో మహిళ చనిపోతే లేదా కోమా స్థితికి చేరితే దోషికి 20 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు విధించవచ్చు. ఈ సెక్షన్‌లోనూ దోషి ప్రాణాలతో బయటికి రాలేడు. జైలులోనే పూర్తి జీవితం గడపాల్సి ఉంటుంది. 
  3. * సెక్షన్ 70: సామూహిక అత్యాచారానికి సంబంధించిన ఈ సెక్షన్‌లో మైనర్‌పై చేసిన నేరానికి శిక్ష విధించే నిబంధన కూడా జతచేశారు. ఈ రెండు కేసుల్లోనూ కనీసం 20 ఏళ్ల జైలు, జరిమానా విధిస్తారు. దీన్ని కూడా యావజ్జీవానికి పెంచవచ్చు.
  4. * సెక్షన్ 71: అత్యాచారం, సామూహిక అత్యాచారంలో ఒక వ్యక్తి దోషిగా తేలి మళ్లీ అదే నేరంలో దోషిగా తేలితే జీవించి ఉన్నంత వరకు ఖైదును అనుభవించాల్సి ఉంటుంది. 
  5. * సెక్షన్ 104: జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎవరినైనా చంపినట్లయితే అతనికి మరణ శిక్ష  విధించవచ్చు. 
  6. * సెక్షన్ 109: ఈ సెక్షన్‌లో హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ఎవరికైనా హాని కలిగిస్తే మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. 
  7. * సెక్షన్ 139: భిక్షాటన కోసం పిల్లలను బలవంతంగా కిడ్నాప్ చేస్తే అతనికి 10 ఏళ్ల జైలు నుంచి జీవిత ఖైదు విధించవచ్చు. ఇందుకోసం పిల్లలను అంగవైకల్యానికి గురిచేస్తే నేరస్థుడు జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుంది. 
  8. * సెక్షన్ 143: మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఈ కేసులో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ నేరాలకు పాల్పడితే అతనికి యావజ్జీవం విధిస్తారు. సెక్షన్ 143(7) ప్రకారం ప్రభుత్వోద్యోగి లేదా పోలీసు ఒక వ్యక్తి అక్రమ రవాణాకు పాల్పడినట్లయితే అతనికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.