ఈయనేనా అభ్యర్థి?

05-05-2024 01:20:06 AM

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల అగచాట్లు

చాలా ప్రాంతాల్లో గుర్తుపట్టేవారు కరువు

పరిచయాలు లేనిప్రాంతాల్లో తిప్పలు

కిందిస్థాయి నేతలనే నమ్ముకొని ప్రచారం

దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులదీ అదే కష్టం

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొత్త కష్టం వచ్చి పడింది. నియోజకవర్గంలోని సుదూర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించటం, సమన్వయం చేయటం తలకు మించిన భారంగా మారింది. అంతగా పరిచయంలేని ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయడం అభ్యర్థులకు కత్తిమీద సాములా తయారైంది. పార్టీ క్యాడర్‌పైనే ఆధారపడి ఆయా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాల్సి వస్తోంది. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు లేకపోవడంతో ప్రచారంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాల్లో అభ్యర్థులను గుర్తు పట్టేవారు కూడా లేరు. ‘ఓహో.. ఈయనేనా ఫలానా పార్టీ అభ్యర్థి?’ అని అడిగే పరిస్థితి ఉన్నది. దీంతో అక్కడ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు చెప్పిందే వేదంలా మారింది. ఆయా ప్రాంతాలపై పట్టు, పరిచయాలున్న ఇతర పార్టీల అభ్యర్థులు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు.  

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను దాటింది చాలా తక్కువ. ఎక్కువగా జగిత్యాల, కోరుట్ల లాంటి నియోజకవర్గాల్లో ఆయనకు అనుచరులున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయనకు పరిచయాలు చాలా తక్కువ. కేవలం పార్టీ పరంగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు వేళ్లమీద లెక్కపెట్టగలిగే ముఖ్య నేతల పరిచయాలే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ లాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయడం కొంత ఇబ్బందిగా మారింది.

ఇదే నిజామాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాజిరెడ్డి గోవర్థన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆయన కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో సుపరిచితులు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు పరిచయాలు చాలా తక్కువ. అందుకే ప్రచారంలో కొంత వెనుకబడ్డట్టుగా కనపడుతున్నారు. అయితే సొంత సామాజికవర్గం ద్వారా ప్రతి ఊరికి ఆయన ప్రచారం చేరుకొనేలా ప్రయత్నిస్తున్నారు.

ఆదిలాబాద్ (ఎస్టీ) లోక్‌సభ పరిధిలో ప్రధాన పార్టీ అయిన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గొడం నగేష్‌కు ఇటు ముధోల్, అటు సిర్పూర్ నియోజకవర్గాలు దూర ప్రాంతాలు. సహజంగానే ఇక్కడ ప్రచారానికి కొంత ఇబ్బంది అనిపించినా.. గతంలో తాను ఎంపీగా, మంత్రిగా పనిచేయడంతో ఆయా పరిచయాలు ఇప్పుడు పనికొస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఈ విషయంలో కొంత వెనుకబడ్డట్టుగానే చెప్పవచ్చు. ఆత్రం సక్కు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆసిఫాబాద్, సిర్పూర్, ఖానాపూర్ లాంటి ఎస్టీ ప్రాంతాల్లో మాత్రమే కాస్త గుర్తుపట్టే అవకాశం ఉంది. మిగిలిన ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, బోథ్ ప్రాంతాల్లో ఆయనకు పరిచయాలు చాలా స్వల్పం. ఆత్రం సుగుణ రాజకీయాలకే కొత్త. ఎస్టీ ప్రాంతాల్లో అది కూడా చాలా స్వల్పంగానే ప్రజలు ఆమెను గుర్తు పడతారు. ముధోల్, నిర్మల్, సిర్పూర్ లాంటి నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తప్పితే.. ఆమెను ఎవరూ గుర్తుపట్టే పరిచయాలు లేవు. దీనితో ప్రచారం యావత్తూ పార్టీ శ్రేణులే చూసుకోవాల్సి వస్తోంది.  

మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ప్రధానంగా బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, బీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ మాలోత్ కవితలు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురికీ లోక్‌సభ స్థానంపై స్పష్టమైన అవగాహన ఉంది. పరిచయాలు ఉన్నాయి. గతంలో సీతారాంనాయక్ ఎంపీగా, బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో ముగ్గురికి ఉన్న పరిచయాలు, ఆయా ప్రాంతాలపై ఉన్న పట్టుతో ముందుకు సాగుతున్నారు.

మెదక్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలకు నియోజకవర్గం మొత్తం పరిచయాలున్నాయి. రాజకీయంగా, వృత్తి పరంగా రఘునందన్‌రావుకు, అలాగే జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డికి మంచి పరిచయాలున్నాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు సొంత సెగ్మెంట్ పటాన్‌చెరు, నర్సాపూర్ చుట్టుపక్కల మాత్రమే పరిచయాలున్నాయి. దుబ్బాక, సిద్దిపేట, మెదక్, గజ్వెల్ లాంటి చోట్ల పార్టీ శ్రేణులే దిక్కుగా మారింది. దీంతో ప్రచారంలో కొంత వెనుకబాటు కనపడుతోంది.

మేడ్చల్ మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రాజకీయంగా, వ్యాపారపరంగానూ సుపరిచితులు. అలాగే స్వచ్చంద సేవతో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి కూడా పరిచయాలున్నాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా చేసినప్పటికీ అంతగా పరిచయాలు లేవు. భారమంతా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిపైనే వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్ లాంటి సెగ్మెంట్లలో తక్కువ పరిచయాలతో ఆయా ప్రాంతాలు అందని ద్రాక్షలాగే ఊరిస్తున్నాయి.

వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చివరి క్షణంలో టిక్కెట్టు తెచ్చుకున్న కడియం కావ్య రాజకీయాల్లోకి కొత్త అయినా.. ఆమె తండ్రి కడియం శ్రీహరికి ఉన్న పరిచయాలే ప్రచారంలో పనికొస్తున్నాయి. కావ్యకు సొంతంగా స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పశ్చిమ, పాలకుర్తి లాంటి సెగ్మెంట్లలో కొంత వరకు పరిచయాలు ఉన్నప్పటికీ.. పరకాల, భూపాలపల్లి లాంటి నియోజకవర్గాల్లో ఆమెకు పరిచయాలు చాలా స్వల్పమనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ తన తండ్రి కడియం శ్రీహరికి రాజకీయంగా ఉన్న పరిచయాలతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆరూరి రమేష్‌కు వ్యక్తిగత పరిచయాల విషయంలో కొంత మెరుగ్గా ఉన్నట్టుగానే చెప్పవచ్చు.

గతంలో ఎమ్మెల్యేగా, అంతకుముందు కాంట్రాక్టర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సివిల్ పనులు చేయడంతో ఆయా ప్రాంతాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, స్థానిక సర్పంచ్‌లతో పరిచయాలు ఉన్నాయి. ఇది ప్రచారంలో ఆయనకు అదనపు ప్రయోజనం చేకూర్చే అంశమే. ఇక బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న సుధీర్‌కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లికి చెందినవారు. అయితే జిల్లాల పునర్విభజనలో జడ్పీ చైర్మన్ అయినా.. ఆయా ప్రాంతాల్లో పరిచయాలు కాస్త తక్కువే. ఉద్యమంనాటి పరిచయాలున్నా.. ప్రచారంలో వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. మొత్తం పార్టీ క్యాడర్‌పైనే భారం వేయాల్సి వస్తోంది.