28 June, 2026 | 2:12 AM

15న ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం

28-06-2026 12:56 AM
  1. ప్రారంభించనున్న హెల్త్ కేర్ ట్రస్టు
  2. వారం రోజుల్లో ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం
  3. భార్యాభర్తల్లో ఒకరి నుంచి మాత్రమే చందా

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్ నూతన హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్)ను అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం రాష్ట్ర సచివాలయంలో హెల్త్ కేర్ ట్రస్టు సమావేశమైంది. ఈ సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది.

జూలై 15న ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. వారం రోజుల్లో ఆస్పత్రుల యాజమాన్యాలతో ట్రస్టు సభ్యులు సమావేశం కానున్నారు. అనంతరం నూతన హెల్త్ స్కీంకు సంబంధించిన సమగ్రమైన విధివిధానాలు, నిబంధనలను ట్రస్టు విడుదల చేయనుంది. ఈ సమావేశంలో ట్రస్టు పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది. భార్యాభర్తలో ఎవరైనా ఒకరి నుంచి మాత్రమే ఈహెచ్‌ఎస్ చందాను తీసుకోవాలని నిర్ణయించింది.

అయితే గతంలో అదనంగా కట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. హెల్త్ ప్యాకేజీ రేట్లు, ఆస్పత్రుల జాబితాను వచ్చే సమావేశంలో ఖరారు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈ పథకంలో చేరదలుచుకోలేని వారి నుంచి ఆప్షన్ తీసుకుని జీతాల నుంచి కట్ చేసిన 1.5 శాతం చందా (డబ్బులు) రద్దు చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు అడిగిన దానికి మాత్రం సీఎస్ స్పష్టత ఇవ్వలేదని సంఘాల నేతలు తెలిపారు.