త్వరలో కొత్త భూచట్టం!
- రాష్ట్రంలో భూ చట్టాలన్నీ ఒకే గొడుగు కిందకు
- అందుకు నూతన ఆర్‌ఓఆర్ యాక్టు
రెవెన్యూ మంత్రితో చర్చించిన ధరణి కమిటీ
18 రాష్ట్రాల్లో ఉన్న భూచట్టాలపై చర్చ
త్వరలోనే ప్రభుత్వానికి ధరణి కమిటీ తుది నివేదిక
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 14 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో కొత్త భూచట్టం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భూ చట్టాలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా నూతన ఆర్‌ఓఆర్ యాక్టును రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి నూతన చట్టమే మేలని ఇప్పటికే ధరణి కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. త్వరలోనే తాము సమర్పించనున్న తుది నివేదికపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ధరణి కమిటీ సభ్యులు ఎం కోదండ రెడ్డి, ఎం సునిల్ కుమార్, మధుసూదన్‌లు సమావేశమై ధరణి సమస్యలు, నూతన భూచట్టం అనివార్యతపై చర్చించారు.
ఇందులో ప్రధానంగా 18 రాష్ట్రాలలో అమలు జరుగుతున్న భూ చట్టాలపై అధ్యాయనం చేసిన ధరణి కమిటీ సభ్యులు మంత్రి పొంగులేటికి వాటి వివరాలు చెప్పారు. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న భూ చట్టాలన్నింటిని ఒకే చట్టంగా రూపొందిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ధరణి కమిటీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధరణి కమిటీ సభ్యులతో భేటీ తర్వాత మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ర్టంలో భూన్యాయ నిపుణులు, సీనియర్ అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలో అమలు జరుగుతున్న ఆర్‌ఓఆర్ యాక్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. భూమి వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ధరణి కమిటీ ప్రభుత్వానికి సూచించిందని వెల్లడించారు.
ధరణి కారణంగానే భూ సమస్యలు
గతంలో కేసీఆర్ ప్రభుత్వం లోపభూయిష్టమైన ఆర్‌ఓఆర్ చట్టం 2020 అమలులో భాగంగా తీసుకువచ్చిన ధరణి కారణంగా రాష్ట్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదన్నారు. అయితే ధరణి పోర్టల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో దానిలో ప్రస్తుతం మార్పులు -చేర్పులు చేపట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు.
అలాగే గత ప్రభుత్వం పార్ట్- చేర్చిన భూ సమస్యలను పరిష్కరిం చాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ధరణి కారణంగా రాష్ట్రంలో లక్షల మంది రైతులు భూ సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. భూ సమస్యల నుంచి రైతులకు ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్‌ను పునర్ వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను, అందుకు సంబంధిం చిన చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు.
అధ్యయనం లేకుండా అమలు..
కేసీఆర్ ప్రభుత్వం హడావిడిగా కనీస అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలో భూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. భూ సమస్యలలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ (ధరణి) ప్రక్షాళన చేసేందుకు సత్వరం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన భూ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ధరణి అధ్యయన కమిటీ చేసిన సిఫారసులపై శుక్రవారం కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. ధరణి కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేకంటే ముందు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.






